Taj Mahal : ప్రేమికుల చిహ్నం తాజ్ మహల్ మూతపడనుంది. దీంతో సందర్శకులు కంగారుపడుతున్నారు. దీనికి కారణం ప్రతిష్ఠాత్మక జీ20 సమావేశాలకు ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో జీ20 సమావేశాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 12న విదేశీ ప్రతినిథులు తాజ్‌మహల్, ఎర్రకోట, బేబీ తాజ్‌తోపాటు ఇతర చారిత్రక ప్రదేశాలను సందర్శించనున్నారు. అందుకు గాను వచ్చే నెల 12న తాజ్‌మహల్ మూతపడనుంది. నాలుగు గంటలపాటు సందర్శకులను ఎవ్వరనీ అనుమతించేది లేదని అధికారులు ప్రకటించారు. అయితే అతిథులు ఏ సమయంలో వస్తారనే విషయంపై ఇంకా స్పష్టత లేదన్నారు. జీ20 సమావేశాల సందర్భంగా మహిళా సాధికారతపై ప్రతినిథులు చర్చించే అవకాశం ఉందని చెప్పారు.
Read Also: Crime News: తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లినే కడతేర్చాడు..
జీ20 సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా
సెప్టెంబరులో నిర్వహించే జీ20 సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా హాజరు కానున్నట్లు అక్కడి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు భారత ప్రధాని మోదీ నుంచి ఆహ్వానం అందినట్లు తెలిపారు. జీ20 సన్నాహక సమావేశాల్లో భాగంగా సెప్టెంబరు 9, 10న ఢిల్లీలో వివిధ ప్రభుత్వాధినేతలతో కేంద్రం భేటీ నిర్వహించనుంది. జీ20 కూటమిలో బంగ్లాదేశ్‌కు సభ్యత్వం లేదు. అయినప్పటికీ అతిథి హోదాలో హసీనా ఈ సదస్సుకు హాజరయ్యే అవకాశముందని అధికారిక వర్గాలు తెలిపాయి. సంప్రదాయం ప్రకారం ఈ సదస్సుకు ఆతిథ్యమిచ్చే దేశం.. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ తదితర సంస్థలతోపాటు కొన్ని అతిథి దేశాలనూ ఆహ్వానిస్తుంది. దక్షిణాసియాలో ఈ ఆహ్వానాన్ని బంగ్లాదేశ్ ఒక్కటే అందుకుంది. జీ20లో సభ్యత్వం లేని ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమన్, సింగపూర్, స్పెయిన్, యూఏఈ దేశాలకూ ఈ ఆహ్వానం అందనుంది.