Site icon NTV Telugu

Mumbai Terror Attack: ముంబై ఉగ్రదాడి.. నిందితుడు రాణాపై దాఖలైన చార్జిషీట్‌లో విస్తుపోయే విషయాలు

Tahawwur Rana

Tahawwur Rana

Mumbai Terror Attack: 2008లో ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడికి కుట్ర పన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌కు చెందిన కెనడాకు చెందిన వ్యాపారవేత్త తహవూర్‌ రాణాపై పోలీసులు కొత్త అనుబంధ ఛార్జిషీటును దాఖలు చేశారు. ముంబై ఉగ్రదాడులకు ముందు 2008 నవంబర్ 21న తహవూర్‌ రాణా రెండు రోజులు పొవాయ్‌లోని ఒక హోటల్‌లో బస చేసినట్లు పోలీసులు ఈ ఛార్జి షీట్‌లో పేర్కొన్నారు. సోమవారం (సెప్టెంబర్ 25), ముంబై పోలీసుల క్రైమ్ బ్రాంచ్ ఉపా కేసులను విచారించే ప్రత్యేక కోర్టులో 400 పేజీలకు పైగా ఉన్న ఈ ఛార్జిషీట్‌ను సమర్పించింది. ఈ కేసులో ఇది నాలుగో ఛార్జిషీటు.

Also Read: Gurpatwant Singh Pannun: ఇండియాను విభజించి అనేక దేశాలు చేయాలనుకున్న ఖలిస్తాన్ ఉగ్రవాది..

తహవూర్‌ రాణా ప్రస్తుతం అమెరికా కస్టడీలో ఉన్నాడు. ముంబై ఉగ్రవాద దాడుల కుట్రకు సంబంధించిన అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. పాకిస్థాన్‌కు చెందిన అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ కోల్‌మన్ హెడ్లీతో కూడా రాణాకు సంబంధాలు ఉన్నాయి. ముంబై ఉగ్రదాడుల వెనుక ప్రధాన కుట్రదారుల్లో డేవిడ్ హెడ్లీ ఒకడు కావడం గమనార్హం. తహవూర్ హుస్సేన్ రాణా నవంబర్ 11, 2008న భారత్‌కు వచ్చి నవంబర్ 21 వరకు దేశంలోనే ఉన్నారని చార్జ్ షీట్‌లో పేర్కొన్నట్లు ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ అధికారి తెలిపారు. ఈ క్రమంలో పొవాయ్‌లోని ఓ హోటల్‌లో రెండు రోజులు గడిపారు. ఉగ్రవాదుల దాడిలో రాణా పాత్ర ఉందని కొంతమంది వాంగ్మూలాలతో పాటు అతనిపై డాక్యుమెంటరీ సాక్ష్యాలు మా వద్ద ఉన్నాయని ఆయన అన్నారు. పాక్-అమెరికన్ టెర్రరిస్ట్ డేవిడ్ కోల్‌మన్ హెడ్లీతో కలిసి ముంబై ఉగ్రదాడుల కుట్రలో తహవూర్ రాణా ప్రమేయం ఉన్నట్లు ఈ ఆధారాలు స్పష్టం చేస్తున్నాయని అధికారి తెలిపారు. నకిలీ డాక్యుమెంట్ల ద్వారా భారత పర్యాటక వీసా పొందడంలో హెడ్లీకి సహకరించినది రాణా అని తెలిసింది. ఉగ్రవాద దాడులు చేసేందుకు లష్కరే తోయిబా వ్యక్తులకు రాణా సహకరించాడని ఆరోపించారు.

Also Read: Supreme Court: న్యాయమూర్తుల నియామకంలో కేంద్రం ఎందుకు జాప్యం చేస్తోంది?

హెడ్లీ, రాణాల మధ్య ఈమెయిల్ సంభాషణలు కూడా క్రైమ్ బ్రాంచ్‌కు అందాయి. ఈ మెయిల్‌లలో ఒకటి ముంబై ఉగ్రవాద దాడులకు సంబంధించినది, అందులో హెడ్లీ మేజర్ ఇక్బాల్ ఈమెయిల్ ఐడీని అడిగాడు. మేజర్ ఇక్బాల్ 26/11 ఉగ్రవాద దాడుల కుట్రలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థానీ గూఢచార సంస్థ ISIతో సంబంధం కలిగి ఉన్నాడని తెలిసిందే. 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో 166 మంది చనిపోయారు. ఈ దాడులు చేసేందుకు పాకిస్థాన్ నుంచి 10 మంది ఉగ్రవాదులు సముద్ర మార్గంలో భారత్‌కు వచ్చారు. 26/11 ఉగ్రదాడుల సమయంలో దేశ ఆర్థిక రాజధాని దాదాపు 60 గంటలకు పైగా ఉగ్రవాదుల ఆధీనంలో ఉంది. ఈ 10 మంది ఉగ్రవాదుల్లో ఒకడైన అజ్మల్ కసబ్ సజీవంగా పట్టుబడ్డాడు. ఆ తర్వాత కసబ్‌కు మరణశిక్ష విధించారు.

Exit mobile version