T20 World Cup: టీ20 వరల్డ్ కప్ వివాదానికి తెర పడింది. ఎట్టకేటకు పాకిస్తాన్ యూ-టర్న్ తీసుకుంది. బంగ్లాదేశ్ బహిష్కరణకు సంఘీభావంగా తాము కొలంబో వేదికగా ఈ నెల 15న ఇండియాతో జరగబోయే మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామని హెచ్చరించింది. ఎట్టకేలకు ఆర్థిక లెక్కలు, ఆంక్షలు ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుని చివరకు భారత్‌తో మ్యాచ్‌కు సిద్ధమైంది.
ఈ మొత్తం పరిణామాల్లో ఐసీసీ కీలకంగా వ్యవహరించింది. పాకిస్తాన్ దారికొచ్చేలా పనిచేసింది. ఐసీసీతో పాటు తోటి సభ్య దేశాల బోర్డులు కూడా పాక్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. పాక్ బాయ్ కాట్ చేస్తే ఆ దేశ క్రికెట్ బోర్డుకు తీవ్ర నష్టంతో పాటు ఇతర దేశాల బోర్డుల ఆదాయం కూడా దెబ్బతింటుందని చెప్పింది. చివరకు ఏ బంగ్లాదేశ్ కోసం పాక్ బాయ్ కాట్ నాటకాన్ని ఆడిందో, చివరకు ఆ బంగ్లాదేశ్ భారత్‌తో మ్యాచ్ ఆడాల్సిందిగా పాక్‌ను కోరింది.
జనవరి 25 – 30: భద్రతా సమస్యల కారణంగా బంగ్లాదేశ్ భారత్‌లో ఆటడానికి నిరాకరించింది. ఐసీసీ ఇందుకు నిరాకరించింది. దీనిపై పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. బంగ్లాను బహిష్కరిస్తే తాము కఠిన నిర్ణయం తీసుకోవచ్చని పాక్ బోర్డు చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ అన్నారు.
ఫిబ్రవరి 1: భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. ఇదే సమయంలో ఆర్థిక జరిమానాలు, ఆంక్షల గురించి పాక్‌కు ఐసీసీ స్పష్టమైన హెచ్చరిక చేసింది.
ఫిబ్రవరి 3: ఐసీసీ బెదిరింపుల నుంచి చర్చలకు ప్రాధాన్యత ఇచ్చింది. ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ECB) చీఫ్ ముబాషిర్ ఉస్మానీ, మోహ్సీన్ నఖ్వీతో వరసగా సమావేశాలు నిర్వహించారు. ప్రసార ఆదాయం కోల్పోయే అవకాశం ఉందని, ఇతర బోర్డుల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది.
ఫిబ్రవరి 5: శ్రీలంక క్రికెట్ (SLC) అధ్యక్షుడు షమ్మీ సిల్వా PCBకి అధికారిక లేఖతో రంగంలోకి దిగారు. కొలంబోలో హై ఓల్టేజ్ మ్యాచ్ రద్దయితే, శ్రీలంక ఆర్థిక నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని చెప్పారు. పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఒంటరవుతున్న సమయంలో శ్రీలంక తన పర్యటన ద్వారా ఎలా మద్దతు ఇచ్చిందనే విషయాన్ని పాకిస్తాన్‌కు గుర్తు చేశారు.
ఫిబ్రవరి 7: నెదర్లాండ్స్ పై పాకిస్తాన్ విజయం సాధించిన తర్వాత, పీసీబీ ‘‘ఫోర్స్ మజురే’’ నిబంధనలు అమలు చేయాలని ఐసీసీకి అధికారికంగా తెలియజేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు భారత్‌లో ఆడకుండా ఉంటున్నామని మోహ్సిన్ నఖ్వీ వాదించారు. ఐసీసీ ఈ అభ్యర్థనను తెలియజేసింది. ప్రభుత్వం చర్చలు జరిపారా.? అని నిలదీసింది.
ఫిబ్రవరి 8: నఖ్వీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాంతో కీలక సమావేశం కోసం ఇమ్రాన్ ఖ్వాజా లాహోర్ చేరుకున్నాడు.
ఫిబ్రవరి 9: పాక్ బహిష్కరణ ఐసీసీ ఆదాయంతో పాటు ఇతర బోర్డులకు ఇచ్చే వార్షిక ఆదాయంపై తీవ్ర ప్రభావం చూసిస్తుందని యూఏఈ క్రికెట్ బోర్డు హెచ్చరించింది. మరోవైపు బంగ్లాదేశ్ కూడా క్రికెట్ ఎకో సిస్టమ్ కోసం పాక్ భారత్‌తో మ్యాచ్ ఆడాలని కోరింది. చివరకు సాయంత్రం పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తన దేశ జట్టు ఫిబ్రవరి 15న ఆడటానికి అనుమతి ఇచ్చారు.
