Site icon NTV Telugu

T20 World Cup: టీ20 ప్రపంచ కప్‌ ఎవరిదో?.. అమీతుమీకి పాక్, ఇంగ్లండ్‌ జట్లు సిద్ధం

T20 World Cup Final

T20 World Cup Final

T20 World Cup: సంచలన ప్రదర్శనలతో ఆసక్తికరంగా సాగిన 2022 టీ20 ప్రపంచకప్‌ తుదిపోరుకు ఆసన్నమైంది. టీ20 కొత్త ప్రపంచ ఛాంపియన్‌ ఎవరో ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది. ఆదివారం జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ జట్టు పాకిస్థాన్‌ను ఢీకొట్టనుంది. 42 గ్రూప్‌ మ్యాచ్‌లు, 2 నాకౌట్‌ మ్యాచ్‌ల తర్వాత 45వ పోరులో విశ్వ విజేత ఎవరో తేలనుంది. టోర్నీలో ఇరు జట్ల ప్రయాణం చూస్తే ఫైనల్‌లో ఆసక్తికర పోరు ఖాయం అనిపిస్తోంది. ప్రస్తుత బలాబలాలు, ఫామ్‌ను బట్టి చూస్తే ఇరు జట్లు సమఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. సెమీఫైనల్‌ మ్యాచ్‌లలోనూ రెండు జట్లూ ఏకపక్ష విజయాలు సాధించి తుది పోరుకు అర్హత సాధించాయి. ఈ మెగా టోర్నీలో ఇప్పటికే చెరోసారి నెగ్గిన ఈ టీమ్‌లలో రెండో సారి ఏ టీమ్‌ గెలుచుకుంటుందో వేచి చూడాల్సిందే. 1992లో ఇంగ్లండ్‌పై పాక్‌ గెలవగా.. మూడు దశాబ్దాల తర్వాత అదే పునరావృతమందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా వరుణుడు కరుణిస్తాడా లేదా అన్నదే సందేహం.

సెమీస్‌లో సత్తా చాటి పాక్‌ జట్టులో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. విజయవంతమైన ఓపెనింగ్ జోడీగా కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్, రిజ్వాన్‌ గుర్తింపు తెచ్చుకున్నారు. భారత్, జింబాబ్వే చేతిలో ఓడిపోయి తొలి వారం తర్వాత టోర్నీ నిష్క్రమణ అంచున నిలిచిన పాక్‌ జట్టును అదృష్టం వరించింది. గ్రూప్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్‌ జట్టు విజయం సాధించడం వల్లే పాక్‌ సెమీస్‌ చేరగలిగింది. ఫైనల్‌ ప్రత్యర్థి దుర్భేద్యంగా కనిపిస్తున్నా… చరిత్ర మాత్రం పాక్‌కు ఉత్సాహాన్నిచ్చేదే. పాక్‌ జట్టు ముందున్నది బలమైన జట్టే కానీ ఫైనల్‌లో వారి ప్రదర్శన ఏ విధంగా ఉంటుదన్నది వేచి చూడాల్సిందే. పాక్‌ మిడిలార్డర్‌లో మసూద్, ఇఫ్తికార్, నవాజ్‌లతో జట్టు బ్యాటింగ్‌ మెరుగ్గానే ఉంది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’కి పోటీ పడుతున్న లెగ్‌స్పిన్నర్‌ షాదాబ్‌ ఆల్‌రౌండర్‌ పాత్రలో జట్టుకు టోర్నీ ఆసాంతం అండగా నిలిచాడు. అన్ని మ్యాచ్‌లలాగే పాక్‌ నలుగురు రెగ్యులర్‌ పేసర్లతో బరిలోకి దిగడం ఖాయం. షాహిన్‌ అఫ్రిది గాయం నుంచి కోలుకున్న తర్వాత ప్రమాదకరంగా మారడం సానుకూలాంశం. నసీమ్, వసీమ్‌ కూడా తమ పరిధిలో రాణిస్తుండగా రవూఫ్‌పై కూడా పాక్‌ ఆశలు పెట్టుకుంది.

Thailand: గబ్బిలాల సూప్ వండుకొని తాగింది.. చివరకు జైలు పాలైంది..

ఇంగ్లాండ్‌ జట్టు విషయానికి వస్తే.. సెమీస్‌లో హేల్స్, కెప్టెన్‌ బట్లర్‌ ఆటను చూస్తే వారిద్దరు ఎలాంటి విధ్వంసం సృష్టించగలరో అంచనా వేయొచ్చు. సెమీస్‌లో రెచ్చిపోయిన ఓపెనర్లు బట్లర్‌, హేల్స్‌తో పాటు స్టోక్స్‌, బ్రూక్‌, మెయిన్‌ అలీ, లివింగ్‌స్టోన్‌లతో ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ ఎంతో బలంగా కనిపిస్తోంది. అయితే మిడిల్‌ ఆర్డర్‌ నుంచి మరింత మెరుగైన ప్రదర్శనను ఇంగ్లిష్‌ జట్టు ఆశిస్తోంది. సామ్‌ కరన్‌, వోక్స్‌ కూడా బ్యాట్‌ ఝుళిపించగలరు. ఇంత లోతైన లైనప్‌ ఉన్న ఇంగ్లాండ్‌ను కట్టడి చేయడం పాక్‌ బౌలర్లకు పెద్ద సవాలే. వోక్స్‌, సామ్‌ కరన్‌, స్టోక్స్‌, రషీద్‌లతో ఆ జట్టు బౌలింగ్‌ కూడా మెరుగ్గానే ఉంది. ముఖ్యంగా ఆఖరి ఓవర్లలో కరన్‌ గొప్పగా రాణిస్తుండడం ఇంగ్లాండ్‌కు సానుకూలాంశం. కానీ తమ స్పిన్‌తో పాక్‌ దెబ్బ కొట్టగలిగితే ఇంగ్లండ్‌కు కష్టం కావచ్చు. అయితే ఓపెనర్లే ఆటను ఏకపక్షంగా మార్చేయగలరు కాబట్టి వారిద్దరే కీలకం కానున్నారు. ఆరంభంలో షాహిన్‌ని సమర్థంగా ఎదుర్కోగలిగితే హేల్స్, బట్లర్‌ ఆపై ఆధిపత్యం ప్రదర్శించగలరు.

ఫైనల్‌కు పెద్ద సమస్య వర్షం రూపంలోనే పొంచి ఉంది. ఆసక్తికర పోరు కోసం అభిమానులు ఎదురు చూస్తున్నా.. మ్యాచ్‌ సవ్యంగా సాగడమే అనుమానంగా మారింది. ఆటకు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఆదివారం 100 శాతం వర్ష సూచన ఉంది. అయితే మెల్‌బోర్న్‌ వాతావరణం అనిశ్చితికి మారుపేరు. ఫైనల్‌కు సోమవారం రిజర్వ్‌ డే. అయితే రిజర్వ్‌ డే రోజు కూడా వర్షం పడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఆ రోజూ ఆట జరగకపోతే పాక్‌-ఇంగ్లాండ్‌ ట్రోఫీని పంచుకుంటాయి.

తుది జట్లు (అంచనా)…

పాకిస్థాన్‌: బాబర్‌ (కెప్టెన్‌), రిజ్వాన్‌, హారిస్‌, మసూద్‌, ఇఫ్తికార్‌, నవాజ్‌, షాదాబ్‌, వసీమ్‌, నసీమ్‌ షా, రవూఫ్‌, అఫ్రిది

ఇంగ్లాండ్‌: బట్లర్‌ (కెప్టెన్‌), హేల్స్‌, మలన్‌/సాల్ట్‌, స్టోక్స్‌, బ్రూక్‌, లివింగ్‌స్టోన్‌, మొయిన్‌ అలీ, సామ్‌ కరన్‌, వోక్స్‌, మార్క్‌ వుడ్‌/జోర్డాన్‌, రషీద్‌

Exit mobile version