Swiggy shares: స్విగ్గీ షేర్లు ఢమాల్.. రికార్డు కనిష్టానికి పడిపోయిన షేర్లు.. కారణం ఏంటి..?

Swiggy

Swiggy

ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. సెప్టెంబరు త్రైమాసికంలో ఏకంగా రూ.922 కోట్ల నికర నష్టం రావడంతో షేర్లు శుక్రవారం భారీగా పడిపోయాయి. స్టాక్ మార్కెట్లో ఒకే రోజు సుమారు 17 శాతం వరకు క్షీణించి రూ.174.90 వద్ద 52 వారాల కనిష్ట స్థాయిని తాకింది. కంపెనీ ఆదాయం 36 శాతం పెరిగి రూ.7,571 కోట్లకు చేరినప్పటికీ, గత త్రైమాసికంతో పోలిస్తే నష్టాలు మరింత పెరగడం ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తించింది. ఫుడ్ డెలివరీ రంగంలో పోటీ పెరగడం, అదే సమయంలో లాభాల బాట పట్టకపోవడం ఈ పతనానికి ప్రధాన కారణంగా మారింది.

ముఖ్యంగా స్విగ్గీకి చెందిన క్విక్ కామర్స్ విభాగం ‘ఇన్‌స్టామార్ట్’ పెను భారంగా పరిణమించింది. ఇన్‌స్టామార్ట్ ఆర్డర్ల పరిమాణం , ఆదాయం పెరిగినప్పటికీ, కస్టమర్లకు ఇస్తున్న ఆఫర్లు, డిస్కౌంట్లు , నిర్వహణ ఖర్చులు పెరగడంతో ఈ విభాగంలో నష్టాలు రూ.895 కోట్లకు పెరిగాయి. లాభార్జన మెరుగుపడకపోగా రోజురోజుకూ ఖర్చులు పెరుగుతుండటం సంస్థ ఆర్థిక పరిస్థితిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తోంది.

ఈ వరుస నష్టాల నేపథ్యంలో ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థలైన గోల్డ్‌మన్ శాక్స్, హెచ్‌ఎస్‌బిసి, సిటీ, జేపీ మోర్గాన్ వంటివి స్విగ్గీ షేర్ల లక్ష్య ధరను గణనీయంగా తగ్గించాయి. ఇన్‌స్టామార్ట్ నిరంతర నష్టాలే కంపెనీకి పెద్ద సవాలుగా మారాయని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. వ్యాపారం పెరుగుతున్నప్పటికీ, లాభాలు రాకపోవడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. రాబోయే రోజుల్లో స్విగ్గీ తన వ్యయాలను తగ్గించుకుని లాభాల బాట పట్టకపోతే మార్కెట్లో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.