NTV Telugu Site icon

Swiggy Platform Fee: నిన్న జొమాటో.. నేడు స్విగ్గీ! ప్లాట్‌ఫామ్‌ ఫీజు పెంచేశాయిగా

Swiggy Platform Fee

Swiggy Platform Fee

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌లు జొమాటో, స్విగ్గీ ఈ పండుగ సీజన్‌లో భారీగా దండుకోవాలని చూస్తున్నాయి. దీపావళి పండగ వేళ నిన్న ప్లాట్‌ఫామ్‌ ఫీజును జొమాటో పెంచగా.. ఈరోజు స్విగ్గీ పెంచింది. ఇకపై ప్రతి ఆర్డర్‌పై రూ.10 చొప్పున స్విగ్గీ వసూలు చేయనుంది. ఇంతకుముందు ఈ ఫీజుగా రూ.7గా ఉంది. జొమాటో ప్లాట్‌ఫామ్‌ ధరల్ని పెంచిన రోజు వ్యవధిలోనే.. స్విగ్గీ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం.

ప్లాట్‌ఫామ్‌ ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయని స్విగ్గీ యాప్‌ ద్వారా స్పష్టమైంది. యాప్‌ ఓపెన్‌ చేయగానే.. ఆర్డర్‌పై ప్లాట్‌ఫామ్‌ ఫీజు హైదరాబాద్‌లో రూ.10గా చూపిస్తోంది. జొమాటో తన ప్లాట్‌ఫామ్ ఫీజును రూ.10కి పెంచిన విషయం తెలిసిందే. జొమాటో మాదిరే స్విగ్గీ కూడా దశల వారీగా ప్లాట్‌ఫామ్‌ ఫీజును పెంచుతూ వస్తోంది. ప్లాట్‌ఫారమ్ ఫీజును రూ.10కి పెంచడంతో.. సోషల్ మీడియాలో ఆహార ప్రియులు మండిపడుతున్నారు. ‘ఫుడ్ ఆర్డర్ చేయడం ఉచిత డెలివరీతో ప్రారంభమైంది. ఇప్పుడు జీఎస్టీ, డెలివరీ, ప్యాకింగ్ ఛార్జీలు, ప్లాట్‌ఫామ్‌ ఫీజు వచ్చాయి’ అని ఒకరు ట్వీట్ చేశారు.

Also Read: OnePlus 13 Lauch: ‘వన్‌ప్లస్‌ 13’ వచ్చేస్తోంది.. ట్రిపుల్ కెమెరా, జంబో బ్యాటరీ!

పండగ సీజన్‌లో సేవలు అందించేందుకు ప్లాట్‌ఫామ్‌ ధరలు పెంచామని, తమ బిల్లులు చెల్లించేందుకు ఈ రుసుములు సాయపడతాయని జొమాటో పేర్కొంది. స్విగ్గీ ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ప్లాట్‌ఫామ్‌ ఫీజును పెంచింది. ప్లాట్‌ఫామ్ ఫీజు అనేది జీఎస్టీ, రెస్టారెంట్ ఛార్జీలు, డెలివరీ ఫీజుకు అదనంగా వసూలు చేస్తున్నాయి. ప్లాట్‌ఫామ్ ఫీజు రూ.10 పైన కూడా 18 శాతం జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది. ఒక్కో ఆర్డర్‌పై రూ.11.80 అదనంగా చెల్లించాలన్నమాట.