Molestation: ఇండిగో 6ఈ-1052 బ్యాంకాక్-ముంబై విమానంలో సిబ్బందిని వేధించినందుకు స్వీడిష్ జాతీయుడిని గురువారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ వ్యక్తిని క్లాస్ ఎరిక్ హెరాల్డ్ జోనాస్ వెస్ట్‌బర్గ్(62)గా గుర్తించారు. బ్యాంకాక్ నుంచి ముంబై వస్తున్న ఇండిగో విమానంలో గురువారం ఓ ప్రయాణికుడు విమానంలోని ఎయిర్‌హోస్టస్‌తో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఎయిర్‌హోస్టస్ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
అసలేం జరిగిందంటే.. వెస్ట్‌బర్గ్ ముందుగా ఆహారం విషయంలో సిబ్బందితో గొడవకు దిగాడు. అతడు కోరుకున్న ఆహారం లేదని విమాన సిబ్బంది చెప్పడంతో వివాదం మొదలైంది. అయితే.. ఎయిర్‌హోస్టస్ సూచన మేరకు అతడు చికెన్ తినేందుకు అంగీకరించారు. ఈ క్రమంలో అతడికి చికెన్ విక్రయించేందుకు ఎయిర్‌హోస్టస్ పీఓఎస్ టర్మినల్‌తో అతడి వద్దకు రాగా నిందితుడు ఆమె చేతిని అసభ్యకరంగా తాకాడు. దీనిపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భోజనం వడ్డిస్తున్న సమయంలో వెస్ట్‌బర్గ్ ఎయిర్ హోస్టెస్‌తో అనుచితంగా ప్రవర్తించాడు. దీంతోపాటు సహ ప్రయాణికుడిపై దాడి చేసి విమానంలో అల్లకల్లోలం సృష్టించాడు. ఈ కేసులో నిందితుడైన స్వీడిష్ జాతీయుడు క్లాస్ ఎరిక్ హెరాల్డ్ జోనాస్ వెస్ట్‌బెర్గ్‌ను ముంబయి పోలీసులు అరెస్టు చేశారు.
Read Also: Bike Stunts: వెనుకో అమ్మాయి.. ముందో అమ్మాయితో.. బైక్‌పై యువకుడి డేంజరస్ స్టంట్స్.. వీడియో వైరల్
ఈ క్రమంలో గురువారం ఇండిగో విమానం ముంబై ఎయిర్‌పోర్టులో దిగాక పోలీసుల అతడిని అరెస్ట్ చేసి అంధేరీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం..నిందితుడు బెయిల్‌పై విడుదలయ్యాడు. గత మూడునెలల్లో భారత విమానాల్లో ఇలాంటి ఘటన వెలుగు చూడటం ఇది ఎనిమిదోసారి కావడంతో కలకలం రేగుతోంది. ఇండిగో ఈ సంఘటనను ధృవీకరించింది. అవసరమైన ప్రోటోకాల్‌లను అనుసరించిందని, అయితే ఇప్పటివరకు ఎటువంటి ప్రకటనలు చేయలేదు. గత మూడు నెలల్లో భారతదేశంలో అరెస్టయిన ఎనిమిదో వికృత విమాన ప్రయాణీకులలో క్లాస్ ఎరిక్ ఒకరని అని అధికారులు తెలిపారు. మార్చి 23న, దుబాయ్-ముంబై ఇండిగో విమానంలో ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి, సహ ప్రయాణీకులు మరియు సిబ్బందిపై దుర్భాషలాడారు. అనంతరం వారికి బెయిల్ మంజూరైంది.