భారత జట్టులోకి ముంబై ఆల్‌రౌండర్ సూర్యాంశ్ శెడ్గే అనూహ్యంగా ఎంపికయ్యాడు. నితీష్ కుమార్ రెడ్డి గాయపడటంతో.. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు వెళ్లే భారత వైట్-బాల్ జట్టులో సూర్యాంశ్ చోటు దక్కించుకున్నాడు. ఈ ‘అదృష్ట అవకాశం’పై సూర్యాంశ్ మెంటార్, భారత మాజీ సెలెక్టర్ జతిన్ పరాంజపే పిటిఐ (PTI)తో మాట్లాడారు. అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉండే భారత డ్రెస్సింగ్ రూమ్‌లో యువ కెప్టెన్లు శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్‌ల సహాయంతో సూర్యాంశ్ ఎంతో నేర్చుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ ఇద్దరూ యువ కెప్టెన్లే కాకుండా.. ఆటగాళ్ల భావాలను అర్థం చేసుకునే మనస్తత్వం ఉన్నవారని పరాంజపే పేర్కొన్నారు. తొలిసారి జట్టులోకి వచ్చిన యువ ఆటగాడి మనసులో ఎలాంటి ఒత్తిడి, ఆందోళన ఉంటాయో వారు సులభంగా గ్రహించగలరన్నారు. ముఖ్యంగా ముంబై, పంజాబ్ కింగ్స్ జట్లలో శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో సూర్యాంశ్ ఆడిన అనుభవం ఉండటం వల్ల టి20 సిరీస్‌లో అతనికి మరింత సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. వన్డే ఫార్మాట్‌లో హార్దిక్ పాండ్యా, నితీష్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో కెప్టెన్ గిల్ కూడా సూర్యాంశ్‌కు దిశా నిర్దేశం చేయగలడని నమ్మకం వ్యక్తం చేశారు. జూన్ 26 నుంచి ఐర్లాండ్‌తో ప్రారంభం కానున్న రెండు టి20ల సిరీస్ కోసం సూర్యాంశ్‌కు పరాంజపే ఒకే సలహా ఇచ్చారు.. డ్రెస్సింగ్ రూమ్‌లోని దిగ్గజాల మధ్య ఒక మంచి మిత్రుడిగా ఉంటూ జ్ఞానాన్ని గ్రహించాలని చెప్పారు.
గత ఏడాదిన్నరగా సూర్యాంశ్ కెరీర్‌ను పర్యవేక్షిస్తున్న పరాంజపే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతను తన ప్రతిభను నిరూపించుకున్నాడని గుర్తుచేశారు. ప్రస్తుతం భారత క్రికెట్‌కు మీడియం పేస్ వేయగల బ్యాటింగ్ ఆల్‌రౌండర్ల అవసరం ఎంతో ఉందన్నారు. సూర్యాంశ్ బౌలింగ్ నైపుణ్యాలను మెరుగుపరచడానికి ప్రముఖ బౌలింగ్ కోచ్ సుబ్రతో బెనర్జీ సాంకేతిక అంశాలపై పని చేస్తున్నారని వెల్లడించారు. ప్రస్తుతం సూర్యాంశ్ బ్యాటింగ్ పరంగా బలంగా ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో బౌలింగ్‌లోనూ రాణించి అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ జెన్యూన్ ఆల్‌రౌండర్‌గా ఎదుగుతాడని పరాంజపే ఆశాభావం వ్యక్తం చేశారు.

