BCCI Likely To Announce India Squad for Sri Lanka Tour Today: మూడు టీ20, మూడు వన్డేల సిరీస్‌లు ఆడేందుకు భారత జట్టు శ్రీలంకకు వెళుతున్న విషయం తెలిసిందే. జూలై 27 నుంచి టీ20 సిరీస్, ఆగస్టు 2 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్నాయి. శ్రీలంక పర్యటనకు భారత జట్లను బీసీసీఐ గురువారం ప్రకటించే అవకాశముంది. బుధవారమే జట్లను ఎంపిక చేయాల్సి ఉండగా.. సెలక్షన్ కమిటీ సమావేశం నేటికి వాయిదా పడ్డట్లు సమాచారం. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, టీమిండియా కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కలిసి జట్టును ఎంపిక చేయనున్నారు.
రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడంతో టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌ను కూడా ఈ సమావేశంలోనే ఎంపిక చేస్తారు. రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యానే పగ్గాలు అందుకుంటాడని అందరూ అనుకున్నా.. సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ ఇవ్వాలని గౌతమ్ గంభీర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పాండ్యాకు ఫిట్‌నెస్ సమస్యలు తలెత్తకుండా.. వర్క్‌లోడ్ మేనేజ్ చేయడానికి గౌతీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్ 2026 వరకు సూర్యనే కెప్టెన్‌గా కొనసాగించాలని భావిస్తున్నాడట. ఈ విషయంపై నేడు క్లారిటీ రానుంది.
రోహిత్ శర్మ సహా విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడంతో భారత టీ20 జట్టులో కుర్రాళ్లకు అవకాశం దక్కనుంది. ఇక వన్డే సిరీస్‌కు రోహిత్, కోహ్లీ దూరంగా ఉండబోతున్నట్లు సమాచారం. దీంతో కేఎల్ రాహుల్ తాత్కాలిక కెప్టెన్‌గా ఎంపిక అయ్యే అవకాశముంది. అతడికి పోటీగా శ్రేయాస్ అయ్యర్ కూడా ఉన్నాడు. బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించిన ఇషాన్ కిషన్ జట్టులోకి ఎంపికవుతాడో లేదో చూడాలి.