ఐపీఎల్‌లో సత్తాచాటిన ‘మిస్టర్ 360’ సూర్యకుమార్ యాదవ్.. భారత జట్టులోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. వరుసగా మూడు సీజన్‌లలో ముంబై ఇండియన్స్ తరఫున రాణించిన సూర్య.. 2021లో విరాట్ కోహ్లీ నాయకత్వంలో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆపై రోహిత్ శర్మ సారథ్యంలో తానేంటో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఇటీవల ఆసియా కప్ 2025లో భారత జట్టును విజేతగా నిలిపిన సూర్య.. ఓ ఆసక్తికర విషయం పంచుకున్నాడు. ఇక తన కోరిక ఎప్పటికీ నెరవేరదు అని తెలిపాడు.
క్రికెట్ దిగ్గజం, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ నాయకత్వంలో ఒక్క మ్యాచ్‌లో అయినా తాను ఆడాలనుకున్నా అని, ఆ కోరిక నెరవేరలేదని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సూర్య మాట్లాడుతూ.. తన కెరీర్‌లో ధోనీ నాయకత్వంలో ఆడకపోవడాన్ని తీవ్రంగా చింతిస్తుంటానని వెల్లడించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సారథ్యంలో ఆడిన సూర్య.. ధోనీ నాయకత్వంలో మాత్రం ఆడలేదు. 2020లో మహీ క్రికెట్ నుంచి తప్పుకోగా.. 2021లో సూరీడు అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఐపీఎల్‌లో ఇద్దరూ వేర్వేరు జట్లకు ఆడుతున్నారు. కనీసం ఐపీఎల్‌లో కూడా ఆ అవకాశం రాలేదు.
Also Read: AUS vs IND: అతడు గంభీర్ మనిషి.. గొప్ప ప్రదర్శన చేయకున్నా జట్టులో ఉంటాడు!
‘ఎంఎస్ ధోనీ భారత జట్టు కెప్టెన్‌గా ఉన్నప్పుడు నాకు ఎప్పుడు టీంలో అవకాశం వస్తుందా అనుకునేవాడిని. మహీ నాయకత్వంలో ఒక్క మ్యాచ్‌లో అయినా ఆడాలనుకున్నా. కానీ ఆ అవకాశం ఎప్పుడూ రాలేదు. ఐపీఎల్‌లో మేమిద్దరం వేర్వేరు జట్లకు ఆడుతున్నాము. బహుశా నా కోరిక ఎప్పటికీ నెరవేరదు. ధోనీ కూల్‌గా ఉండటం చూసినప్పుడల్లా నాకు ఆశ్చర్యం వేసేది. స్టంప్స్ వెనుక అంత ప్రశాంతంగా ఎలా ఉంటాడో అర్ధమయ్యేది కాదు. ఒత్తిడిలోనూ చాలా రిలాక్స్‌గా ఉంటాడు. మ్యాచ్‌లో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిర్ణయాలు తీసుకుంటాడు. ప్రత్యర్థిగా తలపడినప్పుడు ధోనీ నుంచి నేను అదే నేర్చుకున్నా’ అని సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు.
