Site icon NTV Telugu

Surya- Sanju Samson: డోంట్ డిస్టర్బ్ చెట్టా.. సంజూని ఆటపట్టించిన సూర్యకుమార్

Surya

Surya

Surya- Sanju Samson: భారత్- న్యూజిలాండ్ మధ్య ఐదో టీ20 మ్యాచ్‌కు ముందు టీమిండియా తిరువనంతపురం చేరుకుంది. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో సరదా వాతావరణం నెలకొంది. ఈ సమయంలో భారత టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (SKY), వికెట్‌కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ పై చేసిన చమత్కార వ్యాఖ్యలు అభిమానులను నవ్వించారు. అయితే, విమానాశ్రయంలో ఆటగాళ్లు నడుస్తుండగా, సూర్య సరదాగా
“ప్లీజ్ గివ్ వే.. డోంట్ డిస్టర్బ్ చెట్టా” అంటూ వ్యాఖ్యానించారు. మలయాళంలో ‘చెట్టా’ అంటే పెద్ద అన్న అని అర్థం.. ఈ కామెంట్స్ విని వెనుక నడుస్తున్న సంజూ శాంసన్ గట్టిగా నవ్వాడు.. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read Also: Om Shanti Shanti Shantihi Review: ఓం శాంతి శాంతి శాంతిః రివ్యూ

అయితే, ఇటీవల సంజూ శాంసన్ ఫామ్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గత నాలుగు మ్యాచ్‌ల్లో ఆయన కేవలం 40 పరుగులు మాత్రమే చేశాడు. టీ20 వరల్డ్ కప్ 2026 జట్టులో అతడి స్థానం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు, ఇషాన్ కిషన్ మంచి ఫామ్‌లో ఉండటంతో, సంజూ ఆటపై మరింత ఒత్తిడి పెరిగింది. ఇక, మాజీ భారత క్రికెటర్ పార్థివ్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. చివరి టీ20 మ్యాచ్‌లో సంజూ శాంసన్‌కు బదులుగా ఇషాన్ కిషన్‌ను ఆడించాలి అని సూచించాడు. దాదాపు 2.5 సంవత్సరాల తర్వాత ఈ సిరీస్‌తో జట్టులోకి తిరిగొచ్చిన ఇషాన్ బాగా బ్యాటింగ్ చేస్తున్నాడని తెలిపారు.

Read Also: Senior Citizen Railway Concession: సీనియర్ సిటిజన్లకు గుడ్న్యూస్.. బడ్జెట్లో రైల్వే టికెట్‌పై రాయితీలు ఉండే ఛాన్స్!

ఇక, 2025- 26 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ జట్టును తొలిసారి టైటిల్‌ దాకా నడిపిన ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శన చేశాడని పార్థివ్ పటేల్ గుర్తు చేశారు. ఆస్ట్రేలియాతో 2023 చివర్లో చివరి టీ20 ఆడిన తర్వాత, ఇప్పుడు మళ్లీ భారత జట్టులోకి వచ్చాడని చెప్పుకొచ్చారు. అయితే, టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని, కిషన్‌ను ప్రధాన వికెట్‌కీపర్‌గా భావిస్తే, ఇప్పటి నుంచే అతడికి అవకాశాలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఐదో టీ20తో పాటు దక్షిణాఫ్రికాతో జరిగే వార్మప్ మ్యాచ్‌ల్లో కూడా ఇషాన్‌కే కీపింగ్ బాధ్యతలు ఇవ్వాలని సూచించారు. అలాగే, తిలక్ వర్మ వరల్డ్ కప్‌కు ముందు ఫిట్ అవుతాడని పలు నివేదికలు చెబుతున్నాయి. అలా అయితే జట్టులో అతడికి స్థానం కేటాయించాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడే నిర్ణయం తీసుకుని చివరి టీ20లో సంజూ శాంసన్‌ను పక్కన పెట్టి ఇషాన్ కిషన్‌తోనే ముందుకెళ్లాలని పార్థివ్ స్పష్టం చేశారు.

Exit mobile version