Suriya About Kanguva Release Date: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘కంగువ’ చిత్రం విడుదల కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 10న విడుదల కావాల్సిన ఈ చిత్రం.. పలు కారణాల వల్ల వాయిదా పడుతుందని సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. చివరకు ఆ వార్తలే నిజమయ్యేలా ఉన్నాయి. కార్తీ నటించిన ‘మెయ్యజగన్’ ఆడియో లాంచ్ ఈవెంట్‌లో కంగువా రిలీజ్‌పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ తనకు సీనియర్ అని, వేట్టైయాన్‌కు రిలీజ్‌కు దారి ఇవ్వాలి అని సూర్య అన్నారు.
శనివారం జరిగిన మెయ్యజగన్ ఆడియో లాంచ్ ఈవెంట్‌లో సూర్య మాట్లాడుతూ… ‘తమిళ చిత్ర పరిశ్రమ నుంచి ఒక ప్రత్యేకమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించేందుకు దాదాపు రెండున్నరేళ్ల పాటు సుమారు 1000 మందికి పైగా శ్రమించాం. దర్శకుడు శివతో పాటు ప్రతి ఒక్కరూ క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొని కంగువ కోసం పని చేశారు. కష్టపడి పనిచేస్తే.. ఫలితం తప్పకుండా వస్తుందని నేను నమ్ముతా. కంగువ ఎప్పుడు విడుదలైనా మీరు తప్పకుండా అభిమానం, ప్రేమ చూపిస్తారనే నమ్మకం ఉంది. అక్టోబర్ 10న సూపర్ స్టార్ రజనీకాంత్ వేట్టైయాన్ వస్తోంది. ఆ సినిమా రిలీజ్‌కు దారి ఇవ్వాలి. రజనీ సర్ నాకు సీనియర్. 50 ఏళ్లుగా తమిళ సినిమాకు ఆయనే ఐడెంటిటీ. ఆయన సినిమా ముందు వస్తే బాగుంటుందని నా అభిప్రాయం’ అని అన్నారు.
Also Read: Joe Root: సచిన్ రికార్డులను అధిగమిస్తారా?.. జో రూట్ సమాధానం ఇదే!
కంగువా ఒక చిన్న బేబీ లాంటిదని, త్వరలోనే ఆ బేబీ పుట్టినరోజు ఉంది అని సూర్య పేర్కొన్నారు. సూర్య వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కంగువా వాయిదా నిజమేనని నెటిజెన్స్ అంటున్నారు. స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో సూర్య మూడు భిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నారని సమాచారం. దిశా పటానీ కథానాయిక కాగా.. బాబీ దేవోల్ కీలకపాత్ర పోషిస్తున్నారు. పది భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకొస్తుందని సినీవర్గాలు తెలిపాయి.