NTV Telugu Site icon

Suresh Raina: సురేశ్‌ రైనా మెరుపులు.. హైదరాబాద్‌ విజయం!

Suresh Raina Legends League Cricket 2023

Suresh Raina Legends League Cricket 2023

Suresh Raina vintage batting in Legends League Cricket: టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేశ్‌ రైనా మెరుపులు మెరిపించాడు. 27 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్స్‌ సాయంతో 46 రన్స్ చేశాడు. లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ 2023 ఎడిషన్‌లో భాగంగా గురువారం ఇండియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్భన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడుతున్న రైనా సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. రైనా సహా గుర్కీరత్‌ సింగ్‌, క్రిస్‌ మోఫు చెలరేగడంతో హైదరాబాద్‌ జట్టు క్యాపిటల్స్‌పై గెలిచింది. ఈ ఎడిషన్‌లో రైనా నాయకత్వంలోని హైదరాబాద్‌ వరుసగా రెండో విజయం అందుకుంది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన అర్భన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. గుర్కీరత్‌ సింగ్‌ (89; 54 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయగా.. సురేశ్‌ రైనా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పీటర్‌ ట్రెగో (36 నాటౌట్‌; 20 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. డ్వేన్‌ స్మిత్‌ (3), మార్టిన్‌ గప్తిల్‌ (2), స్టువర్ట్‌ బిన్నీ (1) నిరాశపరిచారు. ఇండియా క్యాపిటల్స్‌ బౌలర్లలో ఇసురు ఉడాన 2 వికెట్లు తీశాడు.

Also Read: Team India Coach: దక్షిణాఫ్రికా పర్యటన.. టీమిండియాకు కొత్త కోచ్‌!

190 పరుగుల లక్ష్య ఛేదనలో ఇండియా క్యాపిటల్స్‌ 6 వికెట్స్ కోల్పోయి 186 పరుగులు చేసింది. గెలుపు కోసం ఆఖరి బంతి వరకు పోరాడి 3 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌ (77; 48 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు), ఆష్లే నర్స్‌ (41 నాటౌట్‌; 25 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌) క్యాపిటల్స్‌ను గెలిపించే విఫలయత్నం చేశారు. గౌతమ్‌ గంభీర్‌ (0), హషీమ్‌ ఆమ్లా (5), బెన్‌ డంక్‌ (5) విఫలమయ్యారు. అర్భన్‌రైజర్స్‌ హైదరాబాద్ బౌలర్లలో క్రిస్‌ మోఫు 2 వికెట్లు తీశాడు. నేడు మణిపాల్‌ టైగర్స్‌, భిల్వారా కింగ్స్‌ మధ్య మ్యాచ్‌ జరుగనుంది.