తెలంగాణ సాయుధ పోరాటం చేసిన వారు చాలా మంది ఉన్నారని మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు పెరేడ్స్ గ్రౌండ్‌లో జరిగిన సమావేశానికి వచ్చిన వారికి బీజేపీ బిర్యాని, వాటర్ బాటిల్లు డబ్బులు, ఇచ్చి మీటింగ్ పెట్టిందని, బీజేపీకి ఏమి హక్కు ఉందని, నిజాంకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి ఎందుకు మద్దతు ఇవ్వలేదన్నారు. దేశానికి ఆర్ఎస్ఎస్, బీజేపీలు ప్రమాదకారులని, చరిత్రని వక్రీకరించి వారోత్సవాలు చేసుకోవడం సరైంది కాదని ఆయన హితవు పలికారు. నిజాంకు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కు రహస్య ఒప్పందం జరిగిందని, రజాకార్లు తెలంగాణ గ్రామాల్లో చేసిన అత్యాచారాలు అనేకమని ఆయన మండిపడ్డారు.
సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ సైన్యంతో మరిన్ని దాడులు చేయించారని, రాచరిక నుంచి విముక్తి జరిగిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెబుతున్నారన్నారు. కాశ్మీర్ సిక్కిం త్రిపుర వంటి వాటిని విలీనమని కేవలం తెలంగాణలను విమోచనమనడం అర్థమెంటో బీజేపీ చెప్పాలని, 8 ఏళ్ల కాలంలో బీజేపీ అవలంబించిన విధానాల కారణంగా దేశం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిందని, ప్రజలను విభజించి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ చూస్తుందన్నారు.
