Site icon NTV Telugu

Kangana Ranaut: కాంగ్రెస్‌ మహిళా నేత అభ్యంతరకర పోస్ట్‌! బీజేపీ మండిపాటు

Supriya

Supriya

బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌‌పై కాంగ్రెస్ మహిళా నేత సుప్రియ చేసిన పోస్టు తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారం కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా కంగనా రనౌత్‌ పోటీ చేస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన ఓ అభ్యంతరకర పోస్ట్‌ నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌ మహిళానేత సుప్రియ ఇన్‌స్టాగ్రామ్‌ అధికారిక ఖాతాలో ప్రత్యక్షం కావడంతో కమలనాథులు భగ్గుమన్నారు. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమెను పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు కంగన స్పందిస్తూ.. ప్రతీ మహిళ తన గౌరవానికి అర్హురాలని పేర్కొన్నారు.

క్వీన్‌లో అమాయక పాత్ర నుంచి తలైవిలో శక్తిమంతమైన మహిళా నేత వరకు.. మణికర్ణికలో దేవత పాత్ర నుంచి చంద్రముఖిలో దెయ్యం పాత్ర వరకు.. 20 ఏళ్ల తన సినీ కెరీర్‌లో ఇలా అనేక రకాల పాత్రల్లో నటించానని కంగనా గుర్తుచేశారు. మహిళలను దురాభిమానపు సంకెళ్ల నుంచి కాపాడుకోవాలని.. సెక్స్‌ వర్కర్ల దుర్భర జీవితాలను ప్రస్తావిస్తూ ఇతరులను దూషించడం మానుకోవాలని.. ప్రతి మహిళ తన గౌరవానికి అర్హురాలు అని కంగనా రనౌత్‌ పేర్కొన్నారు.

అయితే.. కంగనాపై పోస్టు చేసింది తాను కాదని సుప్రియా తెలిపారు. ఎక్కడో పొరపాటు జరిగింది అని ఆమె చెప్పుకొచ్చారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల యాక్సెస్‌ చాలామంది దగ్గర ఉందని. వారిలో ఒకరు ఈ అభ్యంతరకర పోస్ట్‌ పెట్టి ఉంటారని సుప్రియ చెప్పుకొచ్చారు. తన దృష్టికి రాగానే వెంటనే దాన్ని తొలగించినట్లు ఆమె చెప్పుకొచ్చారు. అయినా ఒక మహిళ గురించి ఎప్పుడూ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయనని తెలిపారు. ఆ విషయం తనతో పరిచయం ఉన్న వారందరికీ తెలుసు అని వివరించారు. ఈ మేరకు ఎక్స్‌లో సుప్రియ క్లారిటీ ఇచ్చారు. మరీ ఈ దుమారం ఇంతటితో సద్దుమణిగి పోతుందా? లేదంటే ఎన్నికల వేళ మరింత రాజుకుంటుందా? వేచి చూడాలి.

 

Exit mobile version