Supreme Court: “ఇస్లాం మతంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవు”.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!

Supremecourt1

Supremecourt1

Supreme Court: మతం మారితే రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు స్పష్టం మరోసారి స్పష్టం చేసింది! హిందూ మతంలోని కొన్ని సామాజిక వర్గాల నుంచి ఇస్లాంలోకి మారిన వారికి వెనుకబడిన తరగతుల ముస్లిం (BCM) రిజర్వేషన్ ప్రయోజనాలను విస్తరించకూడదంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తాజాగా సమర్థించింది. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రద్దు చేస్తూ గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇక, తాజాగా ఈ తీర్పు ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హిందూ కుల వ్యవస్థతో ముడిపడి ఉన్న సామాజిక వెనుకబాటుతనం అనేది మతం మారిన తర్వాత ఇతర మతాల్లోకి లేదా సామాజిక వ్యవస్థల్లోకి దానంతట అదే రాదని కోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగ సూత్రాల ఆధారంగానే హైకోర్టు ఈ తీర్పు ఇచ్చిందని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.

అసలు ఈ వివాదం తమిళనాడు ప్రభుత్వం మార్చి 2024లో ఇచ్చిన ఓ జీవోతో మొదలైంది. వెనుకబడిన తరగతులు (BC), అత్యంత వెనుకబడిన తరగతులు (MBC), డీనోటిఫైడ్ కమ్యూనిటీలు (DNC), షెడ్యూల్డ్ కులాల (SC) నుంచి ఇస్లాంలోకి మారిన వారు వెనుకబడిన తరగతుల ముస్లిం (Backward Class Muslims – BCM) క్యాటగిరీ కింద కమ్యూనిటీ సర్టిఫికెట్లు పొంది రిజర్వేషన్ ప్రయోజనాలు పొందవచ్చని ఆ జీవోలో పేర్కొంది. అయితే, ఈ జీవో రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేస్తూ మద్రాస్ హైకోర్టులోని మధురై బెంచ్ తీర్పు ఇవ్వడంతో తమిళనాడు ప్రభుత్వం జూలై 6న సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

కోర్టులో తమిళనాడు ప్రభుత్వం తమ నిర్ణయాన్ని బలంగా సమర్థించుకుంది. మతం మారినంత మాత్రాన ఓ వ్యక్తి ఎదుర్కొంటున్న సామాజిక, విద్యారంగ వెనుకబాటుతనం లేదా కష్టాలు ఒక్కసారిగా మాయమైపోవు అని వాదించింది. కేవలం మతం మారారనే కారణంతో ఇప్పటికే రిజర్వేషన్ ప్రయోజనాలు పొందుతున్న వారు వాటిని కోల్పోకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. తమిళనాడు వెనుకబడిన తరగతుల కమిషన్ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగానే ఈ జీవోను రూపొందించామని, ఇది ఇప్పటికే ఉన్న రిజర్వేషన్ల వ్యవస్థను గానీ, సమాజంలోని సామాజిక సమతుల్యతను గానీ ఎంతమాత్రం దెబ్బతీయదని కోర్టుకు విన్నవించింది.

అయితే, హైకోర్టు బెంచ్ (జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్, జస్టిస్ పి.బి. బాలాజీ) ఈ వాదనలను తోసిపుచ్చింది. తమిళనాడులో BCM కింద గుర్తింపు పొందిన అన్సార్, దక్కనీ ముస్లింలు, దూదేకుల, లబ్బాయి (రౌతర్లు, మరక్కాయర్లతో సహా), మాపిళ్ళ, షేక్, సయ్యద్ అనే ఏడు నిర్దేశిత ముస్లిం సమాజాలలోకి, కేవలం మతం మారినంత మాత్రాన ఎవరూ స్వయంచాలకంగా సభ్యులుగా మారిపోలేరని స్పష్టం చేసింది. ఈ ఏడు సామాజిక వర్గాలు పుట్టుక ఆధారంగా ఏర్పడినవని, కేవలం మతం మారడం వల్ల ఆ కుల హోదా లేదా గుర్తింపు రాదని పేర్కొంది. అంతేకాకుండా, ఇస్లాం మతం సమానత్వాన్ని ప్రబోధిస్తుందని, మతం మారడం ద్వారా కుల హోదాను పొందలేరని అభిప్రాయపడింది. గతంలో హైకోర్టులు, సుప్రీంకోర్టు చెప్పిన చట్టపరమైన తీర్పులకు ఈ జీవో విరుద్ధంగా ఉందని తేల్చిచెప్పింది. ఈ కేసు వెనుక ఓ వ్యక్తి పోరాటం ఉంది. 2015లో హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారిన సమీర్ అహ్మద్ అనే వ్యక్తి, తనకు ముస్లిం లబ్బాయి వర్గానికి చెందిన కమ్యూనిటీ సర్టిఫికేట్ కావాలని దరఖాస్తు చేసుకున్నాడు. కానీ తహసీల్దార్ ఆయన అప్లికేషన్‌ను తిరస్కరించడంతో ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ విచారణ సందర్భంలోనే ప్రభుత్వం తన 2024 జీవోను సమర్థించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, హైకోర్టు ఆ జీవోను కొట్టివేసింది. ఇప్పుడు అదే నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం కూడా సరైందని నిర్ధారించి సమర్థించింది.