Supreme Court: లా కోర్సు కాలపరిమితిని తగ్గించాలని దాఖలైన పిటిషన్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం మండిపడింది. పిటిషన్ ను ఉపసంహరించుకోవాలని పిటిషనర్ ను ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి తర్వాత మూడేళ్ల లోపు లా కోర్సు పూర్తి చేసేలా అవకాశం కల్పించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై ఎలాంటి చర్చలు జరపాల్సినవసరం లేదని ప్రస్తుత విధానమే సరైందని చెప్పిన సుప్రీం కోర్టు.. విచారణ జరిపేందుకు నిరాకరించింది.
READ MORE: Revanth Reddy: బీఆర్ఎస్, బీజేపీలపై రేవంత్ కీలక వ్యాఖ్యలు
ప్రస్తుత విధానం ప్రకారం.. డిగ్రీ పూర్తి చేసినవారు మూడేళ్లు, ఇంటర్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణులైనవారు 5 సంవత్సరాల్లో ఎల్ఎల్ బీ పూర్తి చేస్తారు. ఇంటర్ తర్వాత నేరుగా మూడేళ్ల కోర్సుకు అనుమతి వ్వాలని న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ పిటిషన్ దాఖలు చేశారు. నూతన విధానం అమలుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీని నియమించేలా కేంద్రం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఆదేశించాలని కోరారు. ప్రస్తుత జనరేషన్ విద్యర్థులు మూడేళ్లలో లా కోర్సును పూర్తి చేయగలరని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం విధానం వల్ల చాలా సమయం వృథా అవుతోందని.. పేదలు, అమ్మాయిలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్రంగా మండిపడింది. మూడేళ్లు కూడా ఎందుకు..? హైస్కూల్ పూర్తవగానే నేరుగా లా ప్రాక్టీస్ మొదలుపెట్టేయండంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కోర్సుకు అయిదేళ్లయినా తక్కువేనని.. ప్రస్తుత విధానం సరిగ్గానే ఉందని స్పష్టం చేసింది. దీనిపై ఎలాంటి ఆలోచన వద్దని.. ప్రస్తుతం జిల్లాస్థాయి న్యాయవ్యవస్థల్లో 70శాతం మంది మహిళలు ఉన్నారని పేర్కొంది. పిటిషన్ ను వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది.