Supreme Court: సీఈసీ నియామక చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. జడ్జిలు భిన్నాభిప్రాయాలు

  • సీఈసీ నియామక చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
  • ఇద్దరు జడ్జిలు భిన్నాభిప్రాయాలు
  • ‘స్ప్లిట్ వెర్డిక్ట్’గా మారిన వ్యవహారం
Supremecourt

Supremecourt

ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన 2023 చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం భిన్న తీర్పు వెలువరించింది. ఈ పిటిషన్లను ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలా? లేదా? అనే అంశంపై ఇద్దరు సభ్యుల ధర్మాసనంలో ఏకాభిప్రాయం కుదరలేదు.

2023లో తీసుకొచ్చిన చట్టంలోని కొన్ని నిబంధనలను సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. ముఖ్యంగా సీఈసీ, ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన ఎంపిక కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI)ని తొలగించడాన్ని పిటిషనర్లు ప్రశ్నించారు. గతంలో ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియలో సీజేఐ పాత్ర ఉండగా.. 2023 చట్టం ప్రకారం ఎంపిక ప్యానెల్‌లో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉండే విధానం వచ్చింది. ఈ మార్పు రాజ్యాంగబద్ధతపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.

అయితే ఈ పిటిషన్లను ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ అంశాన్ని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం పరిశీలించాల్సిన అవసరం ఉందా? అనే విషయంలో న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జస్టిస్ దీపాంకర్ దత్తా ఈ కేసును ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేయాలన్న అభ్యర్థనను తిరస్కరించారు. మరోవైపు జస్టిస్ ఎస్‌సీ శర్మ మాత్రం ఈ అంశాన్ని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి రిఫర్ చేయాలని అభిప్రాయపడ్డారు. ఇలా ఇద్దరూ కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో తీవ్ర సందిగ్ధం ఏర్పడింది.

ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఇది ‘స్ప్లిట్ వెర్డిక్ట్’గా మారింది. దీంతో పిటిషన్లపై తుది నిర్ణయం వెంటనే వెలువడదు. తదుపరి న్యాయపరమైన ప్రక్రియలో భాగంగా ఈ భిన్నాభిప్రాయాలను పరిష్కరించాల్సి ఉంటుంది. ఈ కేసులో ప్రధానంగా 2023 చట్టంలోని సీఈసీ, ఎన్నికల కమిషనర్ల నియామక విధానం రాజ్యాంగబద్ధమేనా? ఎంపిక కమిటీ నుంచి సీజేఐని తొలగించడం రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఉందా? వంటి అంశాలు పరిశీలనకు రానున్నాయి.