ఉత్తర ప్రదేశ్ లోని ఓ పాఠశాల టీచర్ ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో కొట్టించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇటీవలే జరిగిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆ టీచర్ పై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. చదువు నేర్పించాల్సిన ఓ టీచర్ ఇలా చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇక ఈ ఘటనపై దేశ అత్యన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు స్పందించింది. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ తో కూడిన ధర్మాసనం దీనిపై దాఖలైన ఓ పిటిషన్ విచారణ సందర్భంగా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల తమకు తీవ్ర అభ్యంతరాలున్నట్టు న్యాయమూర్తులు పేర్కొ్న్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం జవాబుదారీ వహించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
Also Read: KL Rahul Six: చూడ్డానికి సన్నగా ఉన్నా.. బంతి మాత్రం స్టేడియం బయట పడింది!
ఆ ఉపాధ్యాయురాలు ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. పిల్లలకు పాఠాలు చెప్పే విధానం ఇదేనా అంటూ ధర్మాసనం మండిపడింది. నాణ్యమైన విద్య అందించడం అంటే ఇదేనా అని ప్రశ్నించిన కోర్టు పాఠశాల సదరు విద్యార్థికి కౌన్సిలర్ ను నియమించిందా? అని విచారించింది. ఇది తీవ్రమైన సమస్య అని ఇది రాష్ట్రప్రభుత్వాన్ని కదిలించాలని అభిప్రాయపడింది. ద్యార్థులపై శారీరక, మానసిక వేధింపులను, కులం, మతం ప్రాతిపదికన వివక్షను విద్యా హక్కు చట్టం నిషేధిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ధర్మాసనం గుర్తుచేసింది. సదరు విద్యార్థికి కౌన్సిలింగ్ ఇప్పించాలని, దాంతో ట్రామా నుంచి అతడు కోలుకోగలడని యూపీ సర్కారును కోర్టు ఆదేశించింది. ఇక ఈ కేసుపై దర్యాప్తును వేగవంతం చేసి నివేదికను అందించడానికి సీనియర్ ఐపీఎస్ అధికారి నియమించాలని ఆదేశించిన ధర్మాసనం మూడు వారాల సమయం ఇచ్చింది. ఘటన జరిగిన వెంటనే ఆ స్కూల్ లైసెన్స్ ను రద్దు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఆ ఘటనలో గాయపడిన విద్యార్థి మాత్రం ఇంకా ఆ భయంలోనే ఉన్నట్లు బాలుడి తండ్రి తెలిపాడు.