Supreme Court: మేనరిక వివాహాలపై సుప్రీం నోటీసులు.. ప్రత్యేక చట్టం తీసుకురావాలని పిటిషన్..

Marriages

Marriages

సమీప రక్తసంబంధీకుల మధ్య జరిగే వివాహాలను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలన్న అంశంపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తాము ప్రభుత్వానికి నేరుగా ఆదేశాలు ఇవ్వడం లేదని, కేవలం ఈ విషయంపై అవగాహన కల్పించడానికే నోటీసులు జారీ చేస్తున్నామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. రక్తసంబంధీకుల వివాహాలను కోర్టులు నియంత్రించలేవని, సామాజిక సంస్కరణల ద్వారా ఇలాంటి వివాహాలను నియంత్రించే అధికారం పూర్తిగా చట్టసభల పరిధిలోకి వస్తుందని ధర్మాసనం అభిప్రాయపడింది.

బెంగళూరుకు చెందిన చార్వి ఎస్ అనే న్యాయ విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఆచారం పేరుతో పిల్లలను ముందే ఊహించగల, నివారించదగిన జన్యుపరమైన లోపాలకు గురిచేసే ఈ పద్ధతిని చట్టం ఇంకా అనుమతించాలా అని ఆమె తన పిటిషన్‌లో ప్రశ్నించారు. తను కూడా సమీప బంధువుల వివాహం వల్ల జన్మించానని, దానివల్ల 40 శాతం దృష్టి లోపంతో బాధపడుతున్నానని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. రక్తసంబంధీకుల వివాహాల వల్ల పుట్టే పిల్లల్లో జన్యుపరమైన సమస్యలు, పుట్టుకతో వచ్చే లోపాలు, అవయవ లోపాలు, శిశు మరణాలు పెరుగుతున్నాయని వైద్య అధ్యయనాలు చెబుతున్నాయని ఆమె పేర్కొన్నారు.

విచారణ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ, ఈ పద్ధతి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతోందని, దీనివల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు సరైన అవగాహన లేదని చెప్పారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, వివాహం అనేది వ్యక్తిగత ఇష్టానికి సంబంధించిన విషయమని, అయితే సరైన అవగాహనతో నిర్ణయం తీసుకునేలా ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉందని పేర్కొంది. పాఠశాల పాఠ్యాంశాల్లో ఈ విషయాన్ని చేర్చడం ద్వారా లేదా విస్తృత ప్రచారం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించే అంశాన్ని పరిశీలించాలని కేంద్రానికి సూచించింది.

హిందూ వివాహ చట్టంలోని నిబంధనల ప్రకారం ఆచారాల పేరుతో సమీప బంధువుల వివాహాలకు ఉన్న మినహాయింపులను పునఃపరిశీలించాలని పిటిషనర్ కోరారు. అలాగే పెళ్లికి ముందు జన్యుపరమైన కౌన్సెలింగ్, వైద్య పరీక్షలు తప్పనిసరి చేసేలా మార్గదర్శకాలు రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ నిబంధనలు భవిష్యత్తులో జరిగే వివాహాల నివారణకు మాత్రమేనని, ఇప్పటికే జరిగిన వివాహాలను నేరంగా పరిగణించకూడదని పిటిషనర్ స్పష్టం చేశారు.