NTV Telugu Site icon

Supreme Court: మేయర్ ఎన్నిక నిర్వహించేది ఇలానేనా? చండీగఢ్ ఆఫీసర్‌కి కోర్టు చీవాట్లు

Suprme Court

Suprme Court

అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఏదైనా చేయొచ్చని. తిమ్మిని బమ్మిని చేసి అడ్డదారుల్లో వెళ్లే ఆఫీసర్స్‌కు దేశ సర్వోన్నత న్యాయస్థానం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల చండీగఢ్ మేయర్ ఎన్నిక సందర్భంగా రిటర్నింగ్ అధికారి చేసిన పనికి సుప్రీంకోర్టు (Supreme Court) గట్టిగానే చీవాట్లు పెట్టింది. మేయర్ ఎన్నిక నిర్వహించేది ఇలానేనా? అంటూ నిలదీసింది. ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేస్తారా? అంటూ న్యాయస్థానం మండిపడింది.

చండీగఢ్ మేయర్ ఎన్నికపై (Chandigarh Mayor Elections) దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి తీరుపై (Returning Officer) ఫైర్ అయింది. చండీగఢ్ మేయర్ ఎన్నికకు సంబంధించిన వీడియోగ్రఫీ సహా అన్ని బ్యాలెట్ పత్రాలు, ఇతర ఒరిజినల్ రికార్డులను పంజాబ్-హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్‌కు అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పేపర్లను తారుమారు చేశాడని స్పష్టంగా తెలుస్తోంది? ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తాడా? ప్రజాస్వామ్యాన్ని ఇలా ఖూనీ చేయడాన్ని అనుమతించబోమంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 7న జరగాల్సిన చండీగఢ్ మునిసిపల్ కార్పొరేషన్ సమావేశాన్ని వాయిదా వేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

ఇటీవల చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల్లో జిమ్మిక్ జరిగింది. ఇండియా కూటమిగా బరిలో దిగిన ఆప్‌, కాంగ్రెస్‌ పార్టీలకు 20 మంది (13+7) కార్పొరేటర్లు ఉన్నారు. బీజేపీకి చెందిన మనోజ్‌ కుమార్‌ సోలంకి కేవలం 16 ఓట్లే ఉన్నాయి. కానీ బీజేపీ అభ్యర్థే మేయర్‌గా ఎన్నికయ్యాడు. దీంతో ఇండియా కూటమి అవాక్కైంది.

ఆప్‌ అభ్యర్థి కుల్‌దీప్‌ కుమార్‌కు 20 మంది మద్దతు ఉన్నా.. 12 ఓట్లే వచ్చాయి. కూటమికి చెందిన 8 ఓట్లు చెల్లలేదని అధికారి ప్రకటించారు. దీంతో ఆగ్రహించిన ఆప్‌, కాంగ్రెస్‌ సభ్యులు కార్పొరేషన్‌ కార్యాలయంలో ఆందోళనకు దిగారు. రిటర్నింగ్ అధికారి తీరుపై మండిపడ్డారు. అనంతరం హైకోర్టును ఆశ్రయించగా ఈ అంశాన్ని పట్టించుకోలేదు. దీంతో ఆప్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సోమవారం దీనిపై విచారణ చేపట్టి ప్రిసైడింగ్‌ అధికారి తీరుపై మండిపడింది.