Site icon NTV Telugu

Phone Tapping Case: అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు ఊరట!

Supremecourt

Supremecourt

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అదనపు ఎస్పీ తిరుపతన్నకు ఊరట లభించింది. సుప్రీంకోర్టు అతడికి బెయిల్‌ మంజూరు చేసింది. తిరుపతన్న బెయిల్‌ పిటిషన్‌ను జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. కేసు దర్యాప్తు, విచారణకి పూర్తిగా సహకరించాలని.. సాక్షులని ప్రభావితం చేయవద్దని తిరుపతన్నకు సుప్రీంకోర్టు కండిషన్స్ పెట్టింది. దాంతో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తొలిసారి తెలంగాణ ప్రభుత్వంకు గట్టి షాక్‌ తగిలింది. గడిచిన 10 నెలలుగా తిరుపతన్న జైలులో ఉన్న విషయం తెలిసిందే.

అదనపు ఎస్పీ తిరుపతన్న బెయిల్‌ను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తిరుపతన్న పాత్రపై దర్యాప్తుకు నాలుగు నెలల సమయం పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా కోర్టుకు తెలిపారు. ఆధారాలు, డేటా ధ్వంసం చేసారని.. గూగుల్ సర్వర్ నుంచి సమాచారం తీసుకుంటున్నామని చెప్పారు. రాజకీయ నేతల ఆదేశాల మేరకు అందరి ఫోన్లను ట్యాప్‌‌ చేశారని, హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ఇందులో ఉన్నాయని చెప్పారు. ఈ కేసులో మిగతా సాక్షులను విచారించాలని, దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో కీలక నిందితుడు తిరుపతన్నకు బెయిల్ ఇవ్వొద్దని లూత్రా కోర్టును కోరారు.

ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు పురోగతి మీద వెస్ట్ జోన్ డీసీపీ సమీక్ష నిర్వహించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సిట్ టీంతో డీసీపీ సమావేశం అయ్యారు. తిరుపతన్న బెల్ మంజూరు వ్యవహారాన్ని అధికారులు చర్చించారు. మరోవైపు విదేశాల్లో ఉన్న నిందితులని హైదరాబాద్ రప్పించే ప్రయత్నాలపై చర్చ జరిగింది. ఇప్పటికే పరారై అమెరికాలో సెటిల్ అయిన ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను ఇండియాకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఏ2 నిందితుడు భుజంగరావుకు ఊరట లభించింది. అనారోగ్య కారణాల రిత్యా ఆయనకు నాంపల్లి క్రిమినల్‌ కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

Exit mobile version