NTV Telugu Site icon

Goutham Reddy: సుప్రీంకోర్టులో వైసీపీ నేత గౌతమ్ రెడ్డికి ఊరట!

Goutham Reddy

Goutham Reddy

వైసీపీ నేత గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని.. ఆధారాలు చేరిపి వేయడం, సాక్షులను బెదిరించడం వంటివి చేయరాదని ఆదేశించింది. మిగతా షరతులన్నీ దర్యాప్తు అధికారి నిర్ణయిస్తారని సుప్రీంకోర్టు పేర్కొంది. జస్టిస్ పార్దివాలా, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం గౌతమ్ రెడ్డి పిటిషన్‌పై విచారణ జరిపింది. గౌతమ్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ దవే, అల్లంకి రమేష్ వాదనలు వినిపించారు.

సత్యనారాయణపురంకు చెందిన గండూరి ఉమామహేశ్వరశాస్త్రి తనపై హత్యాయత్నం జరిగిందని సత్యనారాయణపురం ఠాణాలో గతేడాది ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైసీపీ నేత గౌతమ్ రెడ్డి సహా 9 మందిని నిందితులుగా గుర్తించారు. రూ.కోట్ల విలువైన స్థలం కొల్లగొట్టేందుకు కిరాయి హత్యకు ప్రణాళిక వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ హత్యాయత్నం కేసులో గౌతమ్‌ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో ఈరోజు విచారణ జరిగింది. దాడి చేసిన వ్యక్తే బెయిల్‌పై ఉన్నప్పుడు.. కుట్ర చేశారన్న గౌతమ్‌ రెడ్డిని విచారించాలి కదా? అని కోర్టు ప్రశ్నించింది.