Site icon NTV Telugu

Supreme Court: హయత్ నగర్ లోని 102 ఎకరాల అటవీ భూమి తెలంగాణ ప్రభుత్వానిదే..

Supreme Court

Supreme Court

హయత్ నగర్ లోని 102 ఎకరాల అటవీ భూమి తెలంగాణ ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హయత్ నగర్ గుర్రంగూడ ఫారెస్ట్ బ్లాక్ సర్వేనెంబర్ 201/1లోని 102 ఎకరాల భూ వివాదం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఆ భూమి సాలార్జంగ్ 3 వారసులదేనన్న ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్, తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. 1248హెచ్ సంవత్సరం నాటి సేల్ డీడ్ చెల్లదని కోర్టు స్పష్టం చేసింది. పిటిషన్ లిమిటేషన్ గడువు దాటిందని వెల్లడించింది. ఇది సంపూర్ణంగా తెలంగాణ అటవీ భూమి అని సుప్రీంకోర్టు స్పష్టీకరించింది. 8 వారాల్లో 102 ఎకరాల భూమిని రిజర్వ్ ఫారెస్ట్ గా నోటిఫై చేయాలని చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. ఆ నోటిఫికేషన్ ప్రతులను సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి పంపాలని తీర్పు ఇచ్చింది.

జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ఎస్విఎన్ భట్టి ధర్మాసనం తీర్పు వెలువరించింది. గత కొంతకాలంగా రిజర్వ్ ఫారెస్ట్ భూమిలో ఆక్రమణలు వెలుగుచూశాయి.. ఆక్రమణలపై అటవీ శాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తెలంగాణ అటవీశాఖ వాదనలను సమర్దించింది సుప్రీంకోర్టు. రిజర్వ్ ఫారెస్ట్ భూములు జాతీయ సంపద అని.. ఆ భూములను కాపాడే భాద్యత రాష్ట్ర ప్రభుత్వందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 48ఏ, 51ఏ(జి) ప్రకారం అటవీ భూములను పరిరక్షించడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతని పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పుతో అటవీశాఖకు భారీ ఊరట లభించింది.

ఈ తీర్పుతో రిజర్వ్ ఫారెస్ట్ భూములను అక్రమ ఆక్రమణలు, చట్టవిరుద్ధ హక్కుల నుంచి కాపాడే విషయంలో అటవీ శాఖకు మరింత బలం చేకూరింది. అటవీ సంరక్షణ, పర్యావరణ సమతుల్యత, సుస్థిర అభివృద్ధి పట్ల తెలంగాణ ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతకు ఇది బలమైన మద్దతుగా నిలిచింది.

ఈ కేసులో రాష్ట్ర తరఫున సమర్థంగా వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సి.ఎస్. వైద్యనాథన్, జస్టిస్ (రిటైర్డ్) చల్ల కొడండరామ్, అదనపు సాలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి, అడ్వకేట్ ఆన్ రికార్డ్ కర్ణం శ్రావణ్ కుమార్‌లకు అటవీ శాఖ కృతజ్ఞతలు తెలిపింది. అలాగే జిల్లా అటవీ అధికారులు, డివిజనల్ అటవీ అధికారులు, రేంజ్ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది అనేక సంవత్సరాలుగా చేసిన నిరంతర కృషి వల్లే ఈ కీలక తీర్పు సాధ్యమైందని పేర్కొంది.

Exit mobile version