Supreme Court: ఢిల్లీలో సీజేపీ (CJP) నిరసనల నేపథ్యంలో చెలరేగిన వివాదంపై సుప్రీంకోర్టు కఠినంగా స్పందించింది. ప్రజాజీవనానికి ఎలాంటి ఆటంకం కలగకుండా నగరంలో ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన బారికెడ్లను వెంటనే తొలగించాలని, ఇంటర్నెట్ సేవలను యథావిధిగా పునరుద్ధరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మెట్రో రైళ్లు ఎప్పటిలాగే సాధారణ వేళల్లో నడవాలని, ప్రజల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని తేల్చిచెప్పింది. అయితే, ఇవన్నీ కూడా శాంతిభద్రతల పరిస్థితులకు లోబడి ఉంటాయని కోర్టు పేర్కొంది. అక్టోబర్ 9న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించారంటూ దాఖలైన పిటిషన్లపై అత్యవసరంగా విచారణ చేపట్టిన సందర్భంగా ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అక్టోబర్ 10న జరిగిన నిరసనల సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు, రవాణా రంగంపై విధించిన ఆంక్షల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని పిటిషనర్లు ఆరోపించారు. మెట్రో, రైల్వే సేవలు నిలిచిపోవడంతో పాటు, సుమారు 7 వేల మందిని అక్రమంగా నిర్బంధించారని, నగరంలో కర్ఫ్యూ వాతావరణం తలపించిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జీటీబీ నగర్, విశ్వవిద్యాలయం వంటి మెట్రో స్టేషన్లను పూర్తిగా మూసివేశారని, వందలాది ట్రాఫిక్ ఆంక్షల వల్ల సామాన్యులు అల్లాడిపోయారని వాదించారు.
ఈ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తీవ్రంగా ఖండించారు. నిరసనకారులు ప్రస్తావించిన పిటిషన్ల కాపీలు కూడా తమకు అందజేయలేదన్నారు. ఢిల్లీ మెట్రో ఎప్పటిలాగే సజావుగా నడిచిందని, భద్రతా కారణాల దృష్ట్యా మొత్తం 303 స్టేషన్లలో కేవలం 45 స్టేషన్ల వద్ద మాత్రమే కొన్ని ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను తాత్కాలికంగా నియంత్రించామని వివరించారు. శనివారం రాత్రి 10 గంటల కల్లా ఆ గేట్లన్నీ తెరిచేయడంతో పాటు ఇంటర్నెట్ సేవలను కూడా పునరుద్ధరించినట్లు తెలిపారు. అటు నిర్బంధాలన్నీ చట్టప్రకారమే జరిగాయని స్పష్టం చేస్తూ, దీనిపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో, కోర్టు మరో కీలక అంశాన్ని గట్టిగా ప్రస్తావించింది. వకీళ్లు తమ వృత్తిపరమైన బాధ్యతలను నిర్వర్తించకుండా ఎవరూ అడ్డుకోవడానికి వీళ్లేదని స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉన్నప్పటికీ, ఆ స్వేచ్ఛను బాధ్యతాయుతంగా ఉపయోగించాలని, అవసరమైనప్పుడు తగిన నిబంధనలు ఉంటాయని కోర్టు అభిప్రాయపడింది. ఏదేమైనా ప్రజల కష్టాలను తగ్గిస్తూ, నగరంలో రవాణా వ్యవస్థను పూర్తిగా గాడిన పెట్టాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ ఈ కేసు విచారణను వాయిదా వేసింది.

