బల్వంత్‌సింగ్ రాజోనా క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ముందు సమర్పించాలని రాష్ట్రపతి కార్యదర్శి సుప్రీంకోర్టు ఆదేశించింది. రెండు వారాల్లో క్షమాభిక్ష పిటిషన్‌ను పరిశీలించాలని రాష్ట్రపతిని సుప్రీంకోర్టు కోరింది. అప్పటి పంజాబ్ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్య కేసులో రాజోనాకు మరణశిక్ష విధించబడింది. దీంతో నిందితుడు రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్‌ను దాఖలు చేశాడు. క్షమాభిక్ష పిటిషన్‌ను పరిష్కరించడంలో జాప్యం కారణంగా.. శిక్షను తగ్గించి, విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తూ రాజోనా సుప్రీంకోర్టులో దరఖాస్తు చేశారు. నిర్ణీత గడువులోగా క్షమాభిక్ష పిటిషన్‌ను పరిశీలించకపోతే ఉపశమనం కోసం పిటిషనర్ అభ్యర్థనను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. అనంతరం దీనిపై తదుపరి విచారణను డిసెంబరు 3వ తేదీకి వాయిదా వేసింది.
ముఖ్యమంత్రి బియాంత్‌సింగ్ ఎలా చనిపోయాడు?
పంజాబ్ సచివాలయం.. ఉదయం 12 గంటలు.. కారులో కూర్చున్న ముఖ్యమంత్రి బియాంత్‌సింగ్.. ఎవరితోనే మాట్లాడుతున్నాడు. సరిగ్గా ఇదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ మానవ బాంబు తనను తాను పేల్చుకున్నాడు. ఈ సంఘటనలో సీఎం బియాంత్ సింగ్ అక్కడికక్కడే విగతజీవిగా మారగా.. మొత్తం 16 మంది కూడా చనిపోయారు. ఈ హత్యాకాండకు పాల్పడిన ఇద్దరికి ఉరిశిక్ష, మరో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు శిక్ష తీర్పును కోర్టు ప్రకటించింది. ఈ ఘటన సరిగ్గా ఇదే రోజున 1995 లో జరిగింది. భారతదేశానికి స్వాంతంత్య్రం వచ్చినప్పటి నుంచి పంజాబ్‌లో అల్లర్లు, ఆందోళనలు సర్వసాధారణంగా మారాయి. ఎప్పుడు ఏదో ఒక చోట హింస జరిగేది. ఆందోళనలకు పుల్‌స్టాప్ పెట్టేందుకు కేంద్రం చాలా సార్లు అక్కడ రాష్ట్రపతి పాలన విధించింది. 1987 లో కూడా కేంద్రం రాష్ట్రపతి పాలనకు ఆదేశించింది. నాలుగేండ్ల తర్వాత అక్కడి అసెంబ్లీకి ఎన్నికలు జరుపగా, కాంగ్రెస్ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
నిందితులకు పంజాబ్ కోర్టులో ఉరిశిక్ష..
ముఖ్యమంత్రిగా బియాంత్ సింగ్ నియమితులయ్యారు. వేర్పాటువాదంతో హింసకు పాల్పడుతున్న ఖలిస్తానీ తీవ్రవాదుల సమస్య బియాంత్ సింగ్ ముందు పెద్ద సవాల్‌గా నిలిచింది. సచివాలయం వద్ద కారులో కూర్చుండి అధికారులతో మాట్లాడుతుండగా బెల్ట్ బాంబు రూపంలో మృత్యువు ఎదురుగా వచ్చింది. భద్రతా అధికారులు పక్కకు తప్పించేంతలో ఒక్కసారిగా విస్ఫోటనం జరిగి.. బియాంత్‌సింగ్‌తో పాటు ఎందరో ముక్కలుముక్కలుగా మారిపోయారు. ఈ దాడికి ప్రధాన కారకులైన జగతార సింగ్, బల్వంత్ సింగ్ రాజోనాలకు పంజాబ్ కోర్టు ఉరిశిక్ష విధించింది. మరో ముగ్గురికి జీవిత ఖైదు విధించింది. అయితే, తర్వాత జగతార సింగ్ హైకోర్టును ఆశ్రయించగా.. జగతారకు కింది కోర్టు విధించిన శిక్షను జీవిత ఖైదుగా పంజాబ్ హైకోర్టు మారుస్తూ తీర్పునిచ్చింది. కానీ, బల్వంత్ సింగ్ శిక్షను హైకోర్టు సమర్థించింది. కాగా, 2019 లో గురుపూరబ్ సందర్భంగా బల్వంత్‌సింగ్ శిక్షను జీవిత ఖైదుగా కేంద్ర హోం శాఖ మార్చింది.