Supreme Court: ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. తదుపరి విచారణ వాయిదా..

Supremecourt1

Supremecourt1

Supreme Court: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) నిర్వహణతో పాటు భారత ఎన్నికల సంఘం (EC) పనితీరును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసులో కీలక నిర్ణయం తీసుకుంటూ, సోమవారం రాత్రి ఈసీ సమర్పించిన కౌంటర్ అఫిడవిట్‌కు సమాధానం (రీజాయిండర్) ఇచ్చేందుకు పిటిషనర్ రాకేష్ కుమార్ సింగ్‌కు 10 రోజుల సమయం కేటాయించింది. పిటిషనర్ తరఫున హాజరైన సీనియర్ అడ్వొకేట్ వికాస్ సింగ్ అభ్యర్థన మేరకు ఈ సమయాన్ని ఇచ్చిన న్యాయస్థానం, దీపావళి సెలవులు పూర్తయి, ఈ 10 రోజుల వ్యవధి ముగిశాక నవంబర్ 17న తదుపరి విచారణ చేపట్టే అవకాశం ఉంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, దాంతో ఎస్‌ఐఆర్‌తో సహా దానికి సంబంధించిన చర్యలన్నింటినీ రద్దు చేయాలని, సీఈసీని తాత్కాలికంగా విధుల నుంచి తప్పించాలని పిటిషన్‌లో కోరారు.

అయితే, ఈ ఆరోపణలను ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో బలంగా తిప్పికొట్టింది. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌తో పాటు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషిల ఆమోదంతో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌లో ఈసీ తమ నిర్ణయాలను సమర్థించుకుంది. జూన్ 2025, అక్టోబర్ 2025, మే 2026లలో జారీ చేసిన మూడు ఎస్‌ఐఆర్‌ ఉత్తర్వులు కూడా కమిషన్ ఏకగ్రీవంగా తీసుకున్నవేనని స్పష్టం చేసింది. ఫైళ్ల పరిశీలన సమయంలో కమిషనర్లు ఇచ్చే నోట్లు, సలహాలు లేదా లేవనెత్తే సందేహాలు కమిషన్ తుది నిర్ణయాలు కాబోవని వివరించింది. సాధారణంగా ఫైళ్లు ఒక కమిషనర్ నుంచి మరొక కమిషనర్‌కు, ఆ తర్వాత సీఈసీకి వెళ్తాయని, అత్యవసరమైన వేళల్లో ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఆమోదాలు పొంది తర్వాత రికార్డుల్లో నమోదు చేస్తామని తెలిపింది.

ఇక ఓటర్ల నమోదు ప్రక్రియకు సంబంధించి ఫారం-6లో ఎలాంటి మార్పులు చేయలేదని, అలాంటి సవరణలు చేసే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుందని ఈసీ వివరణ ఇచ్చింది. అయితే, ఆన్‌లైన్ ఫారమ్‌ను చూసినప్పుడు సవరణ జరిగినట్లు అనిపించే అవకాశం ఉన్నందున, అక్టోబర్ 21 నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్‌ను ఫిజికల్ ఫారమ్ తరహాలోనే ‘ఫారం-6’, ‘ఎస్‌ఐఆర్‌ డిక్లరేషన్’ అని రెండుగా విభజించినట్లు తెలిపింది. అలాగే, ఎస్‌ఐఆర్ సర్వేలో మ్యాపింగ్ కాని ఓటర్లు నేరుగా విచారణకు రావాల్సిన అవసరం లేదని, బూత్ స్థాయి అధికారులు (BLO) స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి డాక్యుమెంట్లు సేకరిస్తారని పేర్కొంది. మరీ అత్యవసరమైన మినహాయింపు కేసుల్లో మాత్రమే, అదీ వీలైనంత వరకు ఆన్‌లైన్ ద్వారానే విచారణలు ఉంటాయని స్పష్టం చేసింది. ఎలక్టోరల్ డేటాబేస్ (ECINet) భద్రతపై స్పందిస్తూ, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ERO) ఆదేశాలు లేకుండా ఎలాంటి పేరును చేర్చడం గానీ, తొలగించడం గానీ జరగదని తేల్చిచెప్పింది. ఈ నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు ఐఐటీ (IIT), ఐఐఎస్సీ (IISc) నిపుణులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఇదే సమయంలో సీఈసీని విధుల నుంచి తప్పించాలంటూ చేసిన విజ్ఞప్తి నిలబడదని, సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ ద్వారా మాత్రమే సీఈసీపై చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందని ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది.