NTV Telugu Site icon

SunRisers Hyderabad: సన్ రైజర్స్ జెర్సీ చూశారా.. అచ్చం అక్కడి లాగానే..!

Sunrisers

Sunrisers

ఐపీఎల్ 2024 మార్చి 22న ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికొస్తే, కొత్త ప్లేయర్స్ తో బలంగా ఉంది. ఇప్పటికే ఐడెన్ మార్క్రమ్ ను కెప్టెన్ గా తొలగించి, ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ప్యాట్ కమిన్స్ కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. జట్టులోనూ భారీగా మార్పులు చేపట్టింది. మరోవైపు.. ఈరోజు కొత్త జెర్సీని కూడా విడుదల చేసింది.

ఆరెంజ్ కలర్ ను మిస్ కాకుండా వాటిపై నల్లని చారలను జిగ్ జాగ్ గా ప్రింట్ చేసిన జెర్సీలను సన్ రైజర్స్ తన ఆటగాళ్లకు అందించింది. అయితే.. హైదరాబాద్ చేరుకున్న సన్ రైజర్స్ ఆటగాళ్లు సరికొత్త జెర్సీలతో ఫొటో షూట్ కు హాజరయ్యారు. కొత్త జెర్సీతో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఫోటోలకు ఫోజులిచ్చాడు. కొత్త జెర్సీ విషయాన్ని రివీల్‌ చేస్తూ భువీ ఫోటోనే సన్‌రైజర్స్‌ మేనేజ్‌మెంట్‌ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. హైదరాబాద్‌ వేడిని బయటపెట్టడానికి సిద్దం.. ఐపీఎల్‌ 2024 కోసం మా జ్వలించే కవచం అంటూ క్యాప్షన్లు జోడించింది.

ఈ జెర్సీ సన్ రైజర్స్ ఫ్రాంచైజీకి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఎందుకో తెలుసా.. దక్షిణాఫ్రికాలో గత రెండు సీజన్లుగా ఎస్ఏ టీ20 లీగ్ ను సన్ రైజర్స్ గెలిచింది. ఐడెన్ మార్క్రమ్ నాయకత్వంలోని సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు వరుసగా 2023, 2024 సీజన్లలో చాంపియన్ గా నిలిచింది. ఆ టోర్నీలో ఏ డిజైన్ జెర్సీలు వాడారో, ఇప్పుడు ఐపీఎల్ లోనూ సన్ రైజర్స్ ఆటగాళ్లకు అదే డిజైన్ తో ఉన్న జెర్సీలు అందించారు. కలిసొచ్చిన జెర్సీతో అయినా ఐపీఎల్ లో తమ భాగ్యరేఖ మారుతుందేమోనని సన్ రైజర్స్ యాజమాన్యం ఆశిస్తోంది. రానున్న ఐపీఎల్‌ సీజన్‌ కోసం ఆరెంజ్‌ ఆర్మీ ఇదివరకే సన్నాహకాలను మొదలుపెట్టింది. అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో ప్రాక్టీస్‌ను షురూ చేసింది. మిగిలిన ఆటగాళ్లు కూడా ఒక్కొక్కరుగా హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన ట్రైనింగ్‌ క్యాంప్‌కు చేరుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌ను మార్చి 23న కేకేఆర్‌తో ఆడనుంది.

Show comments