NTV Telugu Site icon

SA20 League 2024: 52 పరుగులకే క్యాపిటల్స్‌ ఆలౌట్‌.. సన్‌రైజర్స్ సంచలన విజయం!

Untitled Design

Untitled Design

Pretoria Capitals All-Out for lowest total in SA20 history: దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌ 2024లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ సంచలన విజయాన్ని అందుకుంది. సెయింట్ జార్జ్ పార్క్‌లోని గ్కెబెర్హాలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్‌ను కేవలం 52 పరుగులకే ఆలౌట్ చేసింది. ఇది దక్షిణాఫ్రికా టీ20 లీగ్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు. దాంతో లీగ్ చరిత్రలోనే ప్రత్యర్థి జట్టును అత్యల్ప స్కోరుకు కట్టడి చేసిన జట్టుగా సన్‌రైజర్స్ రికార్డుల్లో నిలిచింది. స్వల్ప లక్ష్య చేధనను సన్‌రైజర్స్ ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ బౌలింగ్ ఎంచుకుంది. సన్‌రైజర్స్ పేసర్లు చెలరేగడంతో ప్రిటోరియా క్యాపిటల్స్‌ 13.3 ఓవర్లలో కేవలం 52 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు ఫిల్‌ సాల్ట్ (10), విల్ జాక్స్ (12) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ అందుకున్నారు. మిగితా ప్లేయర్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. రూసో, ఇంగ్రామ్, నీషమ్‌ వంటి డేంజరస్‌ ఆటగాళ్లు నిరాశపరిచారు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఒట్నీల్ బార్ట్‌మాన్ 4 వికెట్లతో క్యాపిటల్స్‌ పతనాన్ని శాసించాడు. ఇక వారెల్‌ మూడు, మార్కో జానెసన్‌ రెండు వికెట్లు పడగొట్టారు.

Also Read: Girl Drinking Beer: లైవ్ మ్యాచ్‌లో ఒక్క గుటికలోనే బీర్ మొత్తం తాగేసిన మహిళా అభిమాని.. వీడియో వైరల్!

53 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ ఈస్టర్న్ కేప్ 6.5 ఓవర్లలోనే ఒక్క వికెట్‌ కోల్పోయి ఛేదించింది. డేవిడ్ మలన్ (1) విఫలం కాగా.. టామ్ అబెల్ (31; 22 బంతుల్లో), హెర్మన్ (20; 17 బంతుల్లో) జట్టును గెలిపించారు. ఈ విజయంతో సన్‌రైజర్స్‌ నెట్ రన్ రేటును మెరుగుపర్చుకుని.. బోనస్ పాయింట్ కూడా సాధించింది. పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్‌ రెండో స్థానానికి ఎగబాకింది. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ మూడింటిలో గెలిచింది. ఒక మ్యాచ్‌లో ఓడిపోగా.. మరో మ్యాచ్ రద్దు అయ్యింది.