Site icon NTV Telugu

Sunita Kejriwal: సునీతా కేజ్రీవాల్‌పై ఆప్ మంత్రి కీలక వ్యాఖ్యలు

Suene

Suene

ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్‌ చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ అరెస్టై తీహార్ జైలుకు వెళ్లాక.. సునీతానే అన్ని చక్కబెడుతున్నారు. కేజ్రీవాల్ పంపించే లేఖలను సునీతానే కేజ్రీవాల్ సీటులో కూర్చుని చదువుతున్నారు. దీంతో కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే.. ఆ తర్వాత సునీతానే ఆ పీఠంలో కూర్చుంటారంటూ వార్తలు వినిపిస్తు్న్నాయి. అయితే తాజాగా ఢిల్లీ ఆప్ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.

సునీతా కేజ్రీవాల్ వీడియో సందేశాలు తమ పార్టీపై గొప్ప ప్రభావాన్ని చూపుతున్నాయని ఆప్‌ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్ అన్నారు. కేజ్రీవాల్ రాజీనామా చేయాల్సివస్తే తర్వాత సీఎం ఎవరనే దానిపై ఇంతవరకు స్పష్టత రాలేదు. కానీ తాజాగా సౌరభ్‌ భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

సునీతా కేజ్రీవాల్‌ తనను తాను ఢిల్లీ సీఎం మెసేంజర్‌గా చెబుతుంటారని సౌరభ్‌ మీడియాతో అన్నారు. కేజ్రీవాల్ పంపే సందేశాలను ఆమె వినిపిస్తున్నారని.. అదంతా పార్టీ కార్యకర్తలు, మా మద్దతుదారులపై గొప్ప సానుకూల ప్రభావం చూపుతోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని ఐక్యంగా ఉంచేందుకు సునీతానే బెస్ట్‌ పర్సన్‌ అని వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆమె పార్టీ తరఫున ప్రచారం చేస్తారా? అని విలేకర్లు అడగ్గా.. అదే జరిగితే మేం చాలా సంతోషిస్తామని చెప్పుకొచ్చారు.

అరెస్టు తర్వాత ఈడీ కస్టడీ, తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్ పంపే సందేశాలను ఇప్పటివరకు సునీత పలుమార్లు వినిపించారు. వాటిద్వారా ప్రజలకు ఆయన ఆలోచనలను తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి పదవికి సునీతతో పాటు మంత్రులు అతిశీ, సౌరభ్‌ భరద్వాజ్ పేర్లు కూడా వినిపించాయి. కేజ్రీవాల్ రాజీనామా చేస్తే.. ముఖ్యమంత్రి పదవి ఎవర్ని వరిస్తుందో చూడాలి.

Exit mobile version