Sunil Narine announced Retirement from international cricket: వెస్టిండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా.. టీ20 లీగ్‌లలో మాత్రం కొనసాగుతానని వెల్లడించాడు. ఇక దేశవాళీ వన్డేలకూ నరైన్ గుడ్‌బై చెప్పాడు. సూపర్ 50 కప్ టోర్నమెంట్ తరువాత డొమెస్టిక్ క్రికెట్ నుంచి కూడా తాను తప్పుకోనున్నట్లు తెలిపాడు. ఈ మేరకు నరైన్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశాడు.
సునీల్ నరైన్ వెస్టిండీస్ తరఫున 6 టెస్ట్, 65 వన్డే, 51 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 21, వన్డేల్లో 92, టీ20లలో 52 వికెట్స్ పడగొట్టాడు. నరైన్ మిస్టరీ స్నిన్నర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బంతితో మాయ చేస్తూ.. వెస్టిండీస్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మేటి బ్యాటర్లను సైతం అతడు ముప్పుతిప్పలు పెట్టాడు. 2012లో టీ20 ప్రపంచకప్ గెలిచిన వెస్టిండీస్ జట్టులో నరైన్ సభ్యుడు. ఆ టోర్నీలో అతడు 9 వికెట్లు పడగొట్టాడు.
Also Read: Viral News: రూ. 1000 తిరిగి ఇవ్వడం లేదని.. హోర్డింగ్ ఎక్కిన యువకుడు!
2019లో వెస్టిండీస్ తరపున సునీల్ నరైన్ చివరి మ్యాచ్ ఆడాడు. నాలుగేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ అతడు ఆడలేదు. 2013లో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడిన నరైన్.. 2016లో చివరి వన్డే ఆడాడు. ఇక 2019లో చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. ఇక ఐపీఎల్‌లో 162 మ్యాచ్‌లు ఆడి 163 వికెట్స్ పడగొట్టాడు. ప్రస్తుతం నరైన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడుతున్నాడు. కోల్‌కతా తరఫున మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. ఓపెనర్‌గా కూడా ఆడిన విషయం తెలిసిందే. 2012లో ఐపీఎల్‌లో కోల్‌కతా జట్టులోకి అడుగుపెట్టిన అతడు ఇప్పటికీ అదే జట్టులో కొనసాగుతున్నాడు.