టీమిండియా నయా బ్యాటింగ్ సెన్సేషన్ సర్ఫరాజ్ ఖాన్ బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో సత్తాచాటిన విషయం తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయినా.. రెండో ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీ (150)తో జట్టును ఘోర పరాభవం నుంచి తప్పించాడు. తీవ్ర ఒత్తిడిలోనూ అద్భుత ఇన్నింగ్స్ ఆడి సెన్సేషన్ అయ్యాడు. ఎటాకింగ్ ఆటతో ఆకట్టుకున్న సర్ఫరాజ్‌పై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. అదే సమయంలో బీసీసీఐపై సెటైర్స్ వేశాడు.
దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించినప్పటికీ సర్ఫరాజ్ ఖాన్‌కు సన్నటి నడము లేదని బీసీసీఐ అధికారులు ఇన్నాళ్లు భారత జట్టులో చోటు ఇవ్వలేదని స్పోర్ట్‌స్టార్ కోసం రాసిన కాలమ్‌లో సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. ‘దేశీయ క్రికెట్‌లో వందల కొద్ది పరుగులు చేసినప్పటికీ కొన్నేళ్లుగా సర్ఫరాజ్ ఖాన్‌కు భారత జట్టులో స్థానం దక్కలేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు అవసరమైన సన్నటి నడము అతడికి లేదని నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉన్నవారు భావించడమే ఇందుకు కారణం. మైదానంలో బ్యాటుతో సర్ఫరాజ్ రాబడుతున్న ఫలితాలు.. అతడి నడుము చుట్టుకొలత కన్నా మిన్నగా ఉన్నాయి’ అని సన్నీ అన్నారు.
Also Read: IND vs NZ: గెలుపు జోష్‌లో ఉన్న న్యూజిలాండ్‌కు భారీ షాక్.. మనోళ్లకు పండగే!
‘ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యమిచ్చే వాళ్లు కోరుకునే సన్నటి నడుము రిషబ్ పంత్‌కు కూడా లేదు. కానీ అతడు మైదానంలో ఎంతో ప్రభావం చూపుతాడు. ఒకే ఓవర్లో మ్యాచ్ స్వరూపాన్నే మార్చుతాడు. దయచేసి ఈ యోయో పరీక్షలను పక్కన పెట్టండి. ఓ ఆటగాడు మానసికంగా ఎంత బలంగా ఉన్నాడో చూడండి. అదే ఆటగాడి ఫిట్‌నెస్‌కు అసలైన సూచిక’ అని సునీల్ గవాస్కర్ కోరాడు. బీసీసీఐ మార్గదర్శకాల ప్రకారం.. ఒక ఆటగాడు యో-యో టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించాలంటే 16.5 స్కోరు సాధించాలి.