Sugar Price Hike: ఇథనాల్ కాదు.. చక్కెర ధరలు పెరగడానికి కారణాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..

Sugar

Sugar

Sugar Price Hike: భారతదేశంలో పండుగల సీజన్ మొదలవ్వగానే మార్కెట్లలో సందడి, ఇళ్లలో తీపి పిండివంటల ఘుమఘుమలు సాధారణం. కానీ ఈసారి ఆ పండుగ తీపికి చక్కెర ధరల రూపంలో పెద్ద కష్టమే వచ్చిపడింది. దేశవ్యాప్తంగా పంచదార ధరలు ఒక్కసారిగా కొండెక్కాయి. కొన్ని ప్రాంతాల్లో కిలో రిటైల్ ధర రూ. 65 దాటేయడంతో సామాన్యుడి జేబుకు గట్టిగానే తూట్లు పడుతున్నాయి. పండుగ వేళ చక్కెర ధరల పెరుగుదలతో రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర దుమారం రేగుతోంది. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేందుకు ప్రతిపక్షాలు ప్రధాన ఆయుధంగా మలుచుకున్నాయి. పెరిగిన ధరల వెనుక అసలు కారణం ప్రభుత్వ విధానాలేనని, ఎథనాల్ తయారీ కోసం చెరకును భారీగా మళ్లించడం వల్లే దేశంలో పంచదార కొరత ఏర్పడి ధరలు మండిపోతున్నాయని విపక్షాలు గళమెత్తుతున్నాయి.

ఈ రాజకీయ విమర్శల తుఫానుపై కేంద్ర కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. విపక్షాల ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. దేశంలో చక్కెర సప్లై తగ్గడానికి ఎథనాల్‌కి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అలాగే, పంచదార ధరలు ఇలా నియంత్రణ లేకుండా పెరగడానికి వెనుక ఎవరూ ఊహించని రెండు బలమైన కారణాలు ఉన్నాయని వివరించారు. అందులో మొదటిది చెరకు పంటను తీవ్రంగా దెబ్బతీసిన ‘రెడ్ రాట్’ (ఎర్ర కుళ్ళు) వ్యాధి కాగా, రెండోది ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకు కారణమైన ‘ఎల్ నినో’ ప్రభావం. ఊహించని విధంగా వచ్చిన ఈ రెండు సమస్యల వల్ల ఒక్క భారతదేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా చక్కెరతో సహా పలు వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి బాగా తగ్గిపోయిందని మంత్రి వెల్లడించారు.

అయితే ధరలు పెరుగుతున్నాయని ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదని, దేశంలో పంచదార కొరత అనేదే లేదని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ప్రస్తుతం భారత ఏటా వినియోగ అవసరాలు సుమారు 280 లక్షల టన్నులు కాగా, దేశంలో దానికి సరిపడా కంటే ఎక్కువగానే మిగులు నిల్వలు ఉన్నాయని మంత్రి తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో సుమారు 36 లక్షల టన్నుల చక్కెర నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఇక, పండుగల సీజన్‌లో వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి తాత్కాలిక ప్రాతిపదికన రా సగర్ (కచ్చా చక్కెర)ను దిగుమతి చేసుకోవడం సహా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. అంతేకాకుండా, మిల్లులు, వ్యాపారుల వద్ద ఉన్న స్టాక్‌ను వెంటనే మార్కెట్లలోకి విడుదల చేసి, పాత ధరలకే ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. గ్లోబల్ మార్కెట్‌లో ఎల్ నినో వల్ల రాబోయే రోజుల్లో పంచదార కొరత వస్తుందనే ప్రచారాన్ని నమ్మవద్దని, దేశీయ అవసరాలకు తగినంత పంచదార ఉంచడమే కాకుండా ధరలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం నిరంతరం పర్యవేక్షిస్తోందని స్పష్టం చేశారు.