Healthy Breakfast : వంట చేసే టైమ్ లేదా? రాత్రి ఈ 4 వస్తువులు నానబెడితే చాలు.. ఉదయానికి అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్ రెడీ!

Healthy Breakfast, Oats

Healthy Breakfast, Oats

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఉదయాన్నే ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ వండుకోవడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అందుకే చాలా మంది సమయం లేక టిఫిన్ మానేస్తుంటారు లేదా బయట దొరికే జంక్ ఫుడ్‌పై ఆధారపడుతుంటారు. అలాంటి వారి కోసం ‘ఓట్స్ చియా పుడ్డింగ్’ ఒక అద్భుతమైన ఎంపిక. దీనికి వంట చేయాల్సిన అవసరం లేదు, కేవలం రాత్రి నానబెడితే చాలు.. ఉదయానికి పోషకాల గని సిద్ధమవుతుంది. చక్కెర వాడకుండా తయారుచేసే ఈ పుడ్డింగ్ రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది.

తయారీ విధానం- కావలసిన పదార్థాలు :
ఒక గాజు జార్‌లో అర కప్పు రోల్డ్ ఓట్స్, ఒక టేబుల్ స్పూన్ చియా గింజలు, ముప్పావు కప్పు పాలు (బాదం పాలు కూడా వాడుకోవచ్చు) మీకు నచ్చిన పండ్ల ముక్కలు (ఆపిల్, అరటి లేదా బెర్రీలు) వేసి బాగా కలపాలి. దీన్ని మూత పెట్టి రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచితే, మరుసటి రోజు ఉదయానికి హెల్తీ పుడ్డింగ్ రెడీ అయిపోతుంది. తీపి కావాలనుకునే వారు చక్కెర బదులు ఖర్జూరం లేదా కొద్దిగా తేనె కలుపుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే ఈ బ్రేక్‌ఫాస్ట్ ఫ్రిజ్‌లో రెండు రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇందులో మనం అదనపు చక్కెరను ఏమాత్రం వాడటం లేదు. పండ్లలోని సహజ తీపి దీనికి మంచి రుచిని ఇస్తుంది.  కనుక ఇది డయాబెటిస్ ఉన్నవారికి చాలా మంచిది.

ఆరోగ్య ప్రయోజనాలు :
చియా గింజలు పాలలోని తేమను పీల్చుకుని జెల్ లాగా మారుతాయి. ఇది తిన్న తర్వాత చాలా సేపటి వరకు కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది, దీనివల్ల అతిగా తినడం తగ్గుతుంది. ఓట్స్ శరీరానికి కావాల్సిన శక్తిని నెమ్మదిగా, స్థిరంగా విడుదల చేస్తాయి. దీనివల్ల ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నీరసం రాకుండా ఉంటుంది. అలాగే ఇందులో ఉండే పీచు పదార్థం (Fiber) జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. ముఖ్యంగా చియా గింజల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో.. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

గమనిక: ఏదైనా కొత్త ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకునే ముందు మీ శరీర తత్వానికి అది సరిపోతుందో లేదో డాక్టర్‌ను సంప్రదించి తెలుసుకోవడం ఉత్తమం.