మనలో చాలా మందికి ‘ఫైనల్ పరీక్షలు’ అంటే ఓ ప్రయాణంకు ముగింపు, కొత్త జీవితానికి నాంది. కానీ చెన్నైకి చెందిన ఒక వ్యక్తికి విద్య గమ్యస్థానం కాదు.. జీవితాంతం కొనసాగే ప్రయాణం. తల్లికి వాగ్దానం చేసి 150కి పైగా డిగ్రీలు చేశారు. అతని పేరు ప్రొఫెసర్ డాక్టర్ వి.ఎన్. పార్థిబన్. ఆయనను ‘డిగ్రీల భాండాగారం, ‘వాకింగ్ ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ నాలెడ్జ్’ అని పిలుస్తారు. కానీ ఈ అద్భుతమైన ప్రయాణానికి ప్రొఫెసర్ పార్థిబన్ ప్రేరణ ఎక్కడినుంచి మొదలైందో తెలుసా?. తన తల్లికి చేసిన వాగ్దానంతో అతడి ప్రయాణం ప్రారంభమైంది. ఈ విషయాన్ని పార్థిబన్ స్వయంగా చెప్పారు.
ప్రొఫెసర్ పార్థిబన్ తన మొదటి డిగ్రీని అతి కష్టం మీద పాసయ్యారు. తక్కువ మార్కులు చూసి అతని తల్లి చాలా బాధపడ్డారు. ఆ క్షణమే అతని జీవితంలో ఒక మలుపు తిరిగింది. కేవలం ఉత్తీర్ణుడవ్వడమే కాదు.. గొప్పగా రాణించాలని నిర్ణయించుకున్నారు. ఒక రోజు నిన్ను గర్వపడేలా చేస్తా అమ్మా అని పార్థిబన్ వాగ్దానం చేశారు. తన తల్లికి ఇచ్చిన ఆ వాగ్దానం క్రమంగా ఓ అభిరుచిగా మారింది. చదువు నాలుగు దశాబ్దాలకు పైగా తీరని దాహంగా మారింది. 1981 నుండి నేటి వరకు అతను చదువు ఆపలేదు. మొదట్లో పరీక్షలో బాగా రాణించాలనే లక్ష్యం.. ఇప్పుడు జ్ఞానం కోసం అపరిమితమైన దాహంగా మారింది.
Also Read: World Cup 2025: సెమీఫైనల్ రేసు రసవత్తరం.. న్యూజిలాండ్‌తోనే భారత్‌కు ముప్పు! శ్రీలంక ఉన్నా
ప్రొఫెసర్ పార్థిబన్ సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. ఆయన ఇప్పటివరకు 150 డిగ్రీలు, డిప్లొమాలు సంపాదించారు. ఆర్థిక శాస్త్రం, ప్రజా పరిపాలన, రాజకీయ శాస్త్రం, చట్టం వంటి అంశాలలో అనేక మాస్టర్స్ డిగ్రీలను కలిగి ఉన్నారు. 12 M.Phil. డిగ్రీలను సంపాదించారు. ప్రస్తుతం నాల్గవ Ph.D. చదువుతున్నారు. పార్థిబన్ తన చదువులకు సొంత సంపాదననే వాడుకుంటారు. తన జీతంలో దాదాపు 90 శాతం డబ్బు చదువులకే ఖర్చు చేశారు. విశ్వవిద్యాలయ ఫీజులు, పుస్తకాలు, అధ్యయన సామగ్రికి డబ్బు ఖర్చు చేశారు. 150 డిగ్రీలకు పైగా సంపాదించిన తాను చదువు ఆపనని, 200 డిగ్రీలకు పైగా సాధించడమే తన లక్ష్యం అని పార్థిబన్ చెప్పారు.
