Site icon NTV Telugu

Sthree Nidhi App: పేదలకు 48 గంటల్లో రుణాల మంజూరు.. స్త్రీనిధి మొబైల్ యాప్ లాంచ్..!

Sthree Nidhi

Sthree Nidhi

Streenidhi VOA App: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేద మహిళల జీవితాల్లో అభివృద్ధిని తీసుకొచ్చే దిశగా ఒక కీలక అడుగు పడింది. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్త్రీనిధి, యూనియన్ బ్యాంక్ సంయుక్తంగా రూపొందించిన స్త్రీనిధి మొబైల్ యాప్ ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదరిక నిర్మూలనలో భాగంగా నిజమైన పేద కుటుంబాలకు 48 గంటల్లో రుణాలు అందించేందుకు మొబైల్ టెక్నాలజీ, బయోమెట్రిక్ ధృవీకరణ ఆధారంగా పనిచేసే ఈ యాప్‌ ద్వారా ప్రణాళికలు రూపొందించాం అని తెలిపారు. గత ఆరు నెలలుగా సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్) చేసిన కృషి ఫలితమే ఈ యాప్ అని ఆయన పేర్కొన్నారు.

Read Also: Jagan Mohan Reddy: రాష్ట్రంలో మాఫియాలు రాజ్యమేలుతున్నాయి..!

స్త్రీనిధికి పూర్వ వైభవాన్ని తీసుకురావడమే లక్ష్యంగా ఈ యాప్ అభివృద్ధి చేయబడిందని తెలిపారు. గ్రామీణ మహిళలకు మైక్రో ఫైనాన్స్ సంస్థలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా, ఇంటి నుంచే డిజిటల్ పద్ధతిలో రుణాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఈ యాప్ కల్పిస్తోంది. ఈ యాప్‌ ద్వారా తీసుకునే రుణాల్ని 12 నెలల నుండి 36 నెలల వరకు EMIల రూపంలో చెల్లించవచ్చు. ఇప్పటివరకు స్త్రీనిధి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రూ.18 వేల కోట్ల రుణాలు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు. రుణానికి 11% వడ్డీ మాత్రమే ఉండటం మరో ప్రధాన సౌలభ్యం. ఇకపై రుణ చెల్లింపుల కోసం బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, యాప్ ద్వారానే చెల్లించే సౌకర్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు యాప్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. బ్యాంకులు సర్వర్ సమస్యలు రాకుండా చూస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. చివరగా, స్త్రీనిధి యాప్ భవిష్యత్తులో గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.

Read Also: Jagan Mohan Reddy: రాష్ట్ర ఖజానాను ప్రైవేట్ వ్యక్తులకు తాకట్టు.. ప్రభుత్వంపై జగన్ ఫైర్..!

Exit mobile version