Stray Dog Kills Baby: రాజస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. సిరోహి జిల్లాలో ప్రభుత్వాసుపత్రిలో తల్లి పక్కనే నిద్రిస్తున్న నెల రోజుల వయసున్న చిన్నారిని వీధికుక్క తీసుకెళ్లి చంపినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. ఆసుపత్రి వార్డు బయట మృతదేహం లభ్యమైనట్లు వారు వెల్లడించారు. సోమవారం అర్థరాత్రి రెండు కుక్కలు ఆస్పత్రిలోని టీబీ వార్డులోకి వెళ్లాయని, వాటిలో ఒకటి పసిపాపతో తిరిగి వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజీలో తేలిందని పోలీసులు తెలిపారు. చిన్నారి తండ్రి మహేంద్ర మీనా సిలికోసిస్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరినట్లు ఎస్‌హెచ్‌ఓ కొత్వాలి సీతారాం తెలిపారు. తన ముగ్గురు పిల్లలతో పాటు రోగికి చికిత్స అందిస్తున్న చిన్నారి తల్లి రేఖ నిద్ర పోయిందని ఆయన చెప్పారు. ఘటన జరిగిన సమయంలో ఆసుపత్రి సిబ్బంది వార్డులో లేరని అధికారి తెలిపారు.
Read Also: Hong Kong: మూడేళ్లయింది ఇక చాలు.. మాస్క్ తీసేయండి
అయితే, బిడ్డను కుక్క ఎత్తుకెళ్లిన కాసేపటికి మెళుకువ వచ్చిన రేఖ తన బిడ్డ లేదని గుర్తించి ఆస్పత్రి సిబ్బంది దృష్టికి తీసుకెళ్లింది. దాంతో ఆ పసికందు కోసం అంతా గాలించగా ఆస్పత్రి ఆవరణలో విగతజీవిగా పడివుంది. కుక్క ఆ పసికందు శరీర భాగాలను చిధ్రం చేసింది. దాంతో ఆస్పత్రి సిబ్బంది ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, ఆస్పత్రి సిబ్బందితో కలిసి పసికందు మృతదేహాన్ని ఖననం చేశారు. కాగా, తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఆస్పత్రి సిబ్బంది, పోలీసులు తన బిడ్డను ఖననం చేశారని మహేంద్ర మీనా ఆరోపించాడు. తన భార్యతో తెల్లకాగితం మీద సంతకం తీసుకుని, తనకు చివరిచూపు కూడా దక్కకుండా అంత్యక్రియలు నిర్వహించారని విమర్శించాడు. అదేవిధంగా ఆస్పత్రిలో వీధి కుక్కలు యథేచ్ఛగా సంచరిస్తుంటే సెక్యూరిటీ గార్డులు, సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించాడు.