Story Board: లిక్విడ్ క్యాష్ గగనమైపోయిందా..? ప్లాస్టిక్ కరెన్సీకి, నగదు కొరతకూ లింక్ ఉందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Story Board: పైసా మే పరమాత్మా హై అంటారు. ఎంత ఆన్లైన్ లావాదేవీలు చేసినా.. చేతిలో డబ్బు ఉంటే ఆ ధైర్యమే వేరు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏటీఎంకి వెళ్లి క్యాష్ డ్రా చేసుకునే జనానికి.. ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కొన్నాళ్లుగా ఏటీఎంలలో నగదు నిండుకుంది. బ్యాంకుకు వెళ్లినా అడిగినంత మొత్తంలో లిక్విడ్ ఇవ్వడం కుదరదంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పెద్ద మొత్తంలో నగదు విత్డ్రాయల్స్పై అప్రకటిత నిషేధం అమలౌతోంది.
బ్యాంకుల్లో నగదు కొరత కారణంగా జనం తిప్పలు పడుతున్నారు. బ్యాంకు అకౌంట్లలో లక్షల రూపాయలు ఉన్నప్పటికీ పైసలు తీసుకోలేక పరేషాన్ అవుతున్నారు. యూపీఐ, ఆన్లైన్ చెల్లింపులు మరింత పెంచడానికి బ్యాంకులు క్యాష్ లిమిట్ పాటించాలంటూ ఆర్బీఐ నుంచి వచ్చిన ఆదేశాలే ఇందుకు కారణం. దీంతో బ్యాంకులు నగదు విత్‌డ్రా విషయంలో ఆంక్షలు అమలు చేస్తున్నాయి. కొన్ని బ్యాంకుల్లో రోజుకు రూ.10 వేలు, రూ.20 వేలు మాత్రమే విత్ డ్రాకు అనుమతిస్తుండగా, మరికొన్ని బ్యాంకుల్లో రూ.50 వేల వరకు ఇస్తున్నారు. రూ.లక్ష క్యాష్ కావాలంటే ముందురోజు బ్యాంకుకు వెళ్లి అధికారులను వేడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రూ.లక్ష పైన అవసరమైతే అంత డబ్బు లేదంటూ చేతులెత్తేస్తున్నారు. ఎవరికైతే పైసలు ఇవ్వాలో వారి అకౌంట్‌కు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయాలని సూచిస్తున్నారు. ఫలితంగా మార్కెట్లో క్యాష్ ఫ్లో తగ్గిపోతున్నది. మరోవైపు చాలా చోట్ల నగదు లేక ఏటీఎంలు బోసిపోతున్నాయి. డబ్బులు డ్రా చేయడానికి ప్రయత్నిస్తే నో క్యాష్ అని చూపకుండా ట్రాన్సాక్షన్ డిక్లైన్డ్ అని చూపిస్తున్నాయి. ఇలా రైతులు, చిరువ్యాపారులు, పెన్షనర్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న బ్యాంకర్లు… లీడర్లు, రియల్టర్లు, ఆఫీసర్లు, బడా వ్యాపారులకు మాత్రం ఎంతంటే అంత నగదు చెల్లిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.బ్యాంకర్ల ఆంక్షల వల్ల రైతులు, చిరువ్యాపారులు, పెన్షనర్లతో పాటు వివిధ వర్గాలకు చెందిన సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Also Read
ప్రతి నెలా ఫస్ట్ వీక్‌లో ఉద్యోగులు జీతాలు, పెన్షనర్లు పెన్షన్ డబ్బులు డ్రా చేస్తుండడంతో పెద్ద మొత్తంలో నగదు అవసరమవుతోంది. కానీ బ్యాంకుల్లో సరిపడా క్యాష్ అందుబాటులో ఉండడం లేదు. ఏ బ్యాంకు, ఏ బ్రాంచికి ఎంత నగదు ఇవ్వాలనే విషయమై ఆర్బీఐ గైడ్‌లైన్స్ జారీ చేసిందని, ఆ మేరకే చెస్ట్ బ్యాంకుల నుంచి సప్లై చేస్తున్నారని బ్యాంకర్లు పేర్కొంటున్నారు. వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో వచ్చిన డబ్బుల్లో ఎంత నిల్వ ఉందో చూసుకొని మరుసటిరోజు లావాదేవీలకు కావాల్సిన నగదు కోసం ఇండెంట్ పెడుతున్నారు. ఒక బ్రాంచికి రూ.10 లక్షలు అవసరమైతే రూ.ఐదారు లక్షలు మాత్రమే వస్తున్నట్టు బ్యాంకర్లు వెల్లడిస్తున్నారు. దీంతో మెజారిటీ బ్యాంకుల్లో రోజువారి డిపాజిట్ల డబ్బును రొటేషన్ చేస్తున్నామని పేర్కొంటున్నారు.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని బ్రాంచిల్లో రైతులు, చిరువ్యాపారులకు రూ.10 వేల నుంచి రూ.50 లోపు మాత్రమే చెల్లిచడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మార్కెట్లో నగదు కొరత తీవ్ర సమస్యగా మారి రొటేషన్ తగ్గి అనేక వ్యాపారాలు కుదేలవుతున్నాయి. చిన్నదానికి పెద్ద దానికి ఆన్లైన్ లావాదేవీలు పెరగడం, పెట్టుబడులు పెట్టే వారు తగ్గడం, చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెట్టే వారు బంగారం, వెండి కొనుగోళ్ల వైపు లేదా మ్యూచువల్ ఫండ్స్ వైపు చూస్తుండడంతో బహిరంగ మార్కెట్లో నగదు లభ్యత పెద్ద సమస్యగా మారింది. చిన్న వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారాలు చేసే వారి వరకు వ్యాపారుల చేతిలో కరెన్సీ ఉండడం లేదు. నగదు కోసం ప్రయత్నిస్తున్నా కావాల్సినంత దొరకడం లేదు. వెరసి వ్యాపారులు నానా అవస్థలు పడుతున్నారు.
వ్యాపార సంస్థల అంచనా ప్రకారం రాష్ట్రంలో రోజువారీ నగదు చలామణి సుమారు రూ.80వేల కోట్ల వరకు ఉంటుంది. భారతీయ రిజర్వు బ్యాంకు హైదరాబాద్ పరిధిలో సుమారు 156 కరెన్సీ చెస్ట్‌లు ఉన్నాయి. వీటిలో 37 చెస్ట్‌లు హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. బ్యాంకులకు నగదు నిల్వలు అందించడం, అవసరమైన సమయంలో నోట్ల పంపిణీకి తోడ్పడటం ఈ చెస్ట్‌ల కీలక విధులు. అయితే, ఇటీవల కాలంలో ఆర్బీఐ చెస్ట్‌ల నుంచి కూడా నగదు పెద్దగా బయటకు రావడం లేదని బ్యాంకుల వర్గాలు చెబుతున్నాయి. రూ.10 కోట్లు నగదు కోసం ఇండెంట్ పెడితే నాలుగైదు కోట్లు నగదు ఇచ్చి మిగిలిన మొత్తాన్ని డిపాజిట్ల రూపంలో సర్దుబాటు చేసుకోవాలంటూ ఆర్బీఐ చెస్ట్‌లు కొంతకాలంగా చెబుతున్నాయని ఓ బ్యాంకు అధికారి పేర్కొన్నారు. ఈ కొరత వల్ల నగదు విత్‌డ్రాకు బ్యాంకులకు వెళుతున్న ఖాతాదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉన్న సొమ్ముంతా బ్యాంకులో డిపాజిట్ చేసి.. అవసరానికి పెద్ద మొత్తంలో ఒకేసారి విత్‌డ్రాకు ప్రయత్నిస్తున్న వారి పరిస్థితి అయితే మరింత ఘోరంగా ఉంటోంది. దీంతో నగదు కొరత సమస్యను నేరుగా చెప్పకుండా విత్‌డ్రా పరిమితులు పేరుతో బ్యాంకులు ఖాతాదారులను ఇబ్బంది పెడుతున్నాయి.
ఆర్థిక వ్యవస్థలో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలు అత్యంత కీలకమైనవి. భూములు, ప్లాట్లు, అపార్ట్మెంట్ల్లో ఫ్లాట్ల కొనుగోళ్లు, విక్రయాలు, ఇళ్లు, అపార్ట్మెంట్ల నిర్మాణానికి సంబంధించిన నిర్మాణ సామాగ్రి, ఇంటీరియర్ పనులు వంటి కార్యకలాపాలతో పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారుతుంటోంది. సిమెంట్, స్టీల్, మార్బుల్, టైల్స్, కలప, విద్యుత్తు పరికరాల వ్యాపారాలతోపాటు కార్మిక సేవలు రియల్, నిర్మాణ రంగంతో ముడిపడి ఉంటాయి. అలాంటి ఈ రంగంలో లావాదేవీలు మందగిస్తే దాని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉంటుంది. పెద్ద మొత్తంలో నగదు చలామణీ, ఆర్థిక లావాదేవీలు నిలిచిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టే వారిలో ఐటీ ఉద్యోగుల వాటా 60 శాతం దాకా ఉంటుంది. అయితే, అంతర్జాతీయంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల వల్ల ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగం విషయంలో అభద్రతా భావంతో ఉన్నారు. లేఆ్‌ఫల భయం వెంటాడుతుండడంతో కొత్తపెట్టుబడుల వైపు చూడకుండా గతంలో కొనుగోలు చేసిన ఆస్తులను విక్రయానికి పెడుతున్నారు. కానీ కొనుగోలు చేసే వారు దొరకడం లేదు. వెరసి రియల్ ఎస్టేట్ రంగంలో నగదు ప్రవాహం గణనీయంగా తగ్గిపోయింది.
నగదు కొరత చిన్న వ్యాపారులకు కూడా సమస్యగానే మారింది. లావాదేవీలు తగ్గుముఖం పట్టడంతో వ్యాపార నిర్వహణలో రోజువారీ కార్యకలాపాలకు కూడా ఇబ్బంది పడుతున్నామని వ్యాపారులు వాపోతున్నారు. గతంలో తమ దుకాణానికి వచ్చిన వాళ్లలో ఒకే వ్యక్తి రూ.5లక్షల వరకు కొనుగోళ్లు చేసేవారని, ఇప్పుడు ఓ వ్యక్తి రూ.10 వేలు, రూ.20 వేలుకు మించి కొనుగోళ్లు చేయడం లేదని సికింద్రాబాద్ ప్రాంతంలో వెండి విక్రయాలు చేసే ఓ వ్యాపారి వాపోయారు. ఇక, రోజువారీ చెల్లింపులపై ఆధారపడే కిరాణా దుకాణాలు, కూరగాయల వ్యాపారులు, హోల్‌సేల్ మార్కెట్లు, చిన్న హోటళ్ల నిర్వాహకులు, నిర్మాణ రంగం, రవాణా, వ్యవసాయ అనుబంధ వ్యాపారాలపై నగదు కొరత సమస్య మరింత తీవ్రంగా వేధిస్తోంది. వ్యాపార అవసరాల నిమిత్తం బ్యాంకుల్లో కరెంట్ ఖాతాలు తెరిచే చిరు వ్యాపారులు రోజంతా వ్యాపారం చేసి.. వచ్చిన నగదును బ్యాంకులో జమ చేస్తుంటారు. తమకు సరుకులు సరఫరా చేసే వారితో ఆ ఖాతాల ద్వారానే లావాదేవీలు చేస్తుంటారు. అవసరమైనప్పుడు ఆ ఖాతా నుంచి నగదు విత్ డ్రా చేసి వ్యాపార అవసరాలకు వాడుతుంటారు. అయితే, చిరువ్యాపారులు ఈ రోజు బ్యాంకులో నగదు జమ చేసి.. మరుసటి రోజుఆ డబ్బును నగదు రూపంలో బ్యాంకు నుంచి పొందలేకపోతున్నారు. బ్యాంకుల వద్ద నగదు లేకపోవడం, బ్యాంకులు విత్ డ్రాలపై పరిమితులు పెట్టడంతో వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. నిర్మాణ రంగంలో ఉన్నవారికైతే ఈ పరిమితులు చాలా ఇబ్బందిగా మారాయి. భవన నిర్మాణ కార్మికులకు, రవాణా చార్జీల చెల్లింపులు, వ్యవసాయ కూలీలకు చేసే చెల్లింపులను అన్నివేళలా యూపీఐతో చేయడం సాధ్యం కాదు. రోజువారీ కూలీ చెల్లించకపోతే మరుసటి రోజు పనులు ఆగిపోతాయి. నగదు లేక ఒక్క రోజు పని ఆగినా అది ప్రాజెక్టు పురోగతిపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
ఫలానా కారణం వల్ల నగదు లభ్యతలో కొరత వచ్చిందని స్పష్టంగా చెప్పలేమని బ్యాంకర్లు, ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రాంతాన్ని బట్టి పరిస్థితులు మారుతుంటాయని, ప్రజలు చేసే విత్ డ్రాలు, కొనుగోళ్లు, డిపాజిట్ల మళ్లింపు, పంటల సీజన్, పెళ్లిళ్లు, పండుగలు, స్థానిక వ్యాపారాల అవసరాలు.. ఇవన్నీ నగదు లభ్యతపై ప్రభావం చూపుతాయని అంటున్నారు.ఉద్యోగులు దుబారా ఖర్చులు తగ్గించుకోవడం కూడా నగదు ప్రవాహం తగ్గుముఖం పట్టడానికి ఓ కారణమనే అభిప్రాయాలు ఉన్నాయి. ఆర్థిక మాంద్యం భయమో లేక.. ఉద్యోగం విషయంలో అభద్రతో తెలియదు కానీ.. చాలా మంది ఉద్యోగులు, దిగువ మధ్య తరగతి కుటుంబాల వారు ఇటీవల దుబారా ఖర్చులను తగ్గించుకొని పొదుపు మంత్రం పాటిస్తున్నారని ఆర్థిక నిపుణలు చెబుతున్నారు. వారంలో ఒకటి, రెండు రోజులు రెస్టారెంట్లకు, వారాంతాల్లో స్థానిక పర్యాటక ప్రాంతాలకు వెళ్లే కుటుంబాల సంఖ్య క్రమంగా తగ్గుతోందని వ్యాపారులు అంటున్నారు. ఇది కూడా నగదు ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుందని అభిప్రాయపడుతున్నారు.
నల్లధనం కట్టడి పేరుతో కేంద్ర ప్రభుత్వం రూ.2000 నోట్లు రద్దు చేసింది. రూ.500, రూ.200, రూ.100 నోట్లు అమల్లోకి తెచ్చింది. అయితే చాలామంది రూ.500 నోట్లను తమ వద్ద ఉంచేసుకున్నారు. దీంతో చలామణీలో ఉన్న రూ.500 నోట్ల సంఖ్య చాలా తక్కువుగా ఉంది. బ్యాంకుల ఏటీఎంల్లో కూడా ఎక్కువుగా రూ.200, రూ.100 నోట్లే లభిస్తున్నాయి. రూ.500 నోట్ల అందుబాటు తక్కువుగా ఉండడంతో పెద్ద మొత్తంలో చేసే నగదు చెల్లింపుల అంశంలో వ్యాపారులకు ఇబ్బంది ఎదురవుతోంది. వెరసి నగదు ప్రవాహాన్ని దెబ్బ తీస్తుంది. మొత్తం మీద ఈ క్యాష్ కటకట ఎందుకొచ్చిందో.. ఎప్పటికి సమస్యకు పరిష్కారం దొరుకుతందో తెలియక సామాన్యులు గందరగోళానికి గురవుతున్నారు.
తాజావార్తలు
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
-
RRB Jobs : రైల్వేలో 1,265 ఉద్యోగాలు.. దరఖాస్తులకు నేటి నుంచే అవకాశం
-
OTR: మాగంటి బాబును పక్కన పెట్టిన టీడీపీ పెద్దలు.! మాగంటి రాజకీయానికి బ్రేక్ పడినట్టేనా?
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!