NTV Telugu Site icon

Steve Stolk Fastest Fifty: 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. రిషబ్ పంత్ రికార్డు బద్దలు!

Steve Stolk Fastest Fifty

Steve Stolk Fastest Fifty

Steve Stolk Hits Fastest Fifty in ICC Under 19 World Cup 2024: దక్షిణాఫ్రికా ఓపెనింగ్ బ్యాటర్ స్టీవ్ స్టోల్క్ సంచ‌ల‌నం సృష్టించాడు. ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. శనివారం స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 17 ఏళ్ల స్టీవ్ స్టోల్క్ 13 బంతుల్లో అర్ధ సెంచరీ బాదాడు. ఈ మ్యాచ్‌లో స్టోల్క్ మొత్తంగా 37 బంతుల్లో 8 సిక్సులు, 7 ఫోర్లతో ఏకంగా 86 రన్స్ చేశాడు. స్టోల్క్ విజృంభణతో దక్షిణాఫ్రికా సునాయాస విజయాన్ని అందుకుంది.

టీమిండియా వికెట్ కీప‌ర్ రిషబ్ పంత్ రికార్డును స్టీవ్ స్టోల్క్ బద్ధ‌లు కొట్టాడు. బంగ్లాదేశ్‌లో జరిగిన ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ 2016లో నేపాల్‌పై పంత్ 18 బంతుల్లో అర్ధ శతకం చేశాడు. తాజాగా పంత్ రికార్డును స్టోల్క్ బ్రేక్ చేశాడు. స్టోల్క్ ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లతో పాటు బౌండరీ బాది ఏకంగా 34 పరుగులు పిండుకున్నాడు. అండర్ 19 ప్రపంచకప్ చరిత్రలోనే ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా మరో రికార్డు నెలకొల్పాడు. స్కాట్లాండ్ బౌలర్ ఖాసిమ్ ఖాన్.. స్టోల్క్ ఊచకోతకు బలయ్యాడు.

Also Read: IND vs ENG: రవీంద్ర జడేజా ఖాతాలో అరుదైన రికార్డు!

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 269 పరుగులు చేసింది. జామియా డంక్ (90; 121 బంతుల్లో 11 ఫోర్లు), ఓవెన్ గౌల్డ్ (97; 89 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన దక్షిణాఫ్రికా స్టీవ్ స్టోల్క్ విధ్వంసంతో 27 ఓవర్లలోనే 3 వికెట్లకు 273 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. దీవాన్ మరైస్ (80), డేవిడ్ తీగర్ (40) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.