NTV Telugu Site icon

SLBC Meeting: SLBC సమావేశంలో కీలక నిర్ణయం.. రూ.5,40,000 కోట్లతో రుణ ప్రణాళిక..

Slbc

Slbc

SLBC Meeting: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) సమావేశం ముగిసింది.. 5 ప్రధాన అంశాలపై మెరుగైన ఫలితాలు సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, బ్యాంకర్లతో సబ్ కమిటీ ఏర్పాటుకు ఈ సమావేశం నిర్ణయం తీసుకుంది.. వ్యవసాయంలో సాగు ఖర్చులు తగ్గించడంపై బ్యాంకర్లు సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు.. కౌలు రైతులకు సులభంగా రుణాలు అందించాలని.. మెరుగైన పంటల బీమాను అందుబాటులోకి తేవాలన్న ఏపీ సీఎం. పి 4 విధానం ద్వారా పేదరిక నిర్మూలనకు అవసరమైన ప్రాజెక్టులు, ప్రణాళిక చేపట్టాలన్నారు. సూపర్ సిక్స్‌లో పీ-4 గురించి ఈ సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు సీఎం చంద్రబాబు.. డిజిటల్ లావాదేవీల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలని సూచించిన ఆయన.. స్కిల్ డెవలప్‌మెంట్‌ చర్యలకు బ్యాంకర్ల సాయం ఉండాలన్నారు..

Read Also: PM Modi: రష్యా మాకు ‘ఆల్ వెదర్ ఫ్రెండ్’’.. ‘డిస్కో డాన్సర్‌’ గురించి ప్రస్తావన..

ఇక, సంపద సృష్టించే, జీఎస్డీపీపీ రంగాలకు ప్రోత్సాహం ఇవ్వాలని సూచించారు సీఎం చంద్రబాబు.. కీలకాంశాలపై మంత్రులు, బ్యాంకర్లు, ఆయా రంగాల నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలన్నారు.. ఈ సందర్భంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రుణ ప్రణాళిక విడుదల చేసింది SLBC. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.5,40,000 కోట్లతో రుణ ప్రణాళిక విడుదల చేశారు.. రూ.3,75,000 కోట్లు ప్రాధాన్య రంగాలకు, రూ.1,65,000 కోట్లు ఇతర రంగాలకు కేటాయిస్తూ రుణ ప్రణాళిక రూపొందించారు.. వ్యవసాయ రంగానికి రూ.2,64,000 కోట్లు రుణాలు లక్ష్యం కాగా.. గతానికంటే 14 శాతం అధికంగా రుణాలిచ్చేలా ప్రణాళిక ఉంది.. డైరీ, ఫౌల్ట్రీ, ఫిషరీస్, వ్యవసాయ యాంత్రీకరణకు, వ్యవసాయం రంగంలో మౌళిక సదుపాయాలకు రూ.32,600 కోట్లతో రుణ ప్రణాళిక ప్రవేశపెట్టారు.. గతేడాది పెట్టిన వ్యవసాయ రుణ ప్రణాళిక లక్ష్యంలో 90 శాతం మేర రుణాలు మంజూరు చేశామని.. ఉద్యోగ, ఉపాధి కల్పనకు దోహద పడే MSME రంగానికి రూ.87,000 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నామని.. అలాగే గృహ నిర్మాణానికి రూ.11500 కోట్లు రుణాలు ఇచ్చేందుకు ప్రణాళిక ఉందని.. సాంప్రదాయేత ఇంథన సెక్టార్ కు రూ. 8000 కోట్లు రుణ ప్రణాళిక సిద్దం చేసినట్టు రుణ ప్రణాళికలో పేర్కొంది రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం.