SSC Paper Leak: తెలుగు రాష్ట్రాల్లో లీకు వీరులు ఎక్కువైపోయారు. తెలంగాణలో టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారం దుమారం రేపుతుండగా వికారాబాద్ లో తాజాగా 10వతరగతి ప్రశ్నాపత్నం లీకైందన్న వార్త కలకలం రేపింది. ఏపీలోని కడపలో కూడా ఇలాంటి లీక్ వ్యవహారం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉంటే తెలంగాణలో పదోతరగతి పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే పేపర్ లీక్ అయింది. వికారాబాద్ జిల్లా తాండూర్‌లో తెలుగు పేపర్ లీక్ కలకలం సృష్టించింది. పేపర్ లీక్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఉదయం 9.37 నిమిషాలకు పేపర్‌ను ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టినట్లు సమాచారం. సోమవారం ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా.. ఇంతలోనే పేపర్ లీక్ కావడంతో అందరూ అవాక్కయ్యారు. పరీక్షలకు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. ప్రశ్నాపత్రం లీక్ వంటి ఘటనలు జరుగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా టెన్త్ ఎగ్జామ్ ప్రశ్నాపత్రం లీక్ కావడం చర్చనీయాంశంగా మారింది.
పేపర్ లీక్‌పై ఆరా తీస్తే ఓ ఉపాధ్యాయుడు దీనిని లీక్ చేసినట్లు తేల్చారు. వికారాబాద్ జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయుడు బంధ్యప్ప ఈ పేపర్ లీక్ చేసినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే ఆయనను తహసీల్దార్ కార్యాలయానికి పిలిపించి పోలీసులు విచారించారు. ఎవరు దేని కోసం లీక్ చేశారనే కోణంలో విచారణ కొనసాగుతోంది. పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కాగా.. 9 గంటల 37 నిమిషాలకే ప్రశ్నాపత్రం వాట్సాప్ లో ప్రత్యక్షమైంది. అయితే ఈ ప్రశ్నాపత్రం తాండూరులోని ఓ పరీక్షా కేంద్రం నుంచి లీకైనట్లు తెలిసింది. అయితే పేపర్ లీకైనట్లు వస్తున్న వార్తలపై వికారాబాద్ డీఈవో స్పందించారు. తమ జిల్లాలో పేపర్ లీక్ కాలేదంటూ వివరణ ఇచ్చారు. అయితే ప్రశ్నాపత్రం లీక్ వార్తలతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన ఏర్పడింది. తాండూరు నంబర్ వన్ స్కూల్‌లో బంధ్యప్ప అనే సైన్స్ టీచర్ ఉదయం 9.37 నిమిషాలకు తన ఫోన్ నుంచి వాట్సాప్ గ్రూప్ లో క్వశ్చన్ పేపర్ పెట్టినట్లు పోలీసులు నిర్దారించారు. ఫోటో ఎన్ని గంటలకు తీశారు ? పరీక్ష కంటే ముందే ఫోటో తీసి ఎవరికైనా ఇచ్చారా ?అని పోలీసులు పరిశీలిస్తున్నారు.
Read Also: Tenth Class Paper Leak: కడపలో టెన్త్ ప్రశ్నాపత్రం లీక్
ప్రస్తుతం ఉపాధ్యాయుడు బంద్యప్ప పోలీసుల అదుపులో ఉన్నారు. పోలీసులు బంధ్యప్ప ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. తాండూర్‌లో టెన్త్ క్లాస్ పేపర్ లీక్ కలకలం నేపథ్యంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డితో డీఈఓ రేణుకా దేవి సమావేశమయ్యారు. ఈ పేపర్ లీక్ వ్యవహారాన్ని పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. అయితే మొదట పేపర్ లీక్ కాలేదంటూ విద్యాశాఖ అధికారులు చెప్పినా పేపర్ లీకేజీ వార్తలను పోలీసులు నిర్ధారించారు. పదో తరగతి పేపర్ లీకేజీ ఘటనపై కేసు నమోదు చేస్తామని వికారాబాద్ అదనపు ఎస్పీ మురళి వెల్లడించారు. పేపర్ ఎక్కడా లీక్ కాలేదని, స్కూల్‌లో ఉన్న సైన్స్ టీచర్ బంద్యప్ప 10వ తరగతి పేపర్ ను వాట్సాప్ ద్వారా ఒక మీడియా గ్రూప్‌లో షేర్ చేశాడన్నారు. 9.37కు పేపర్ వాట్సాప్ గ్రూప్‌లో పెట్టాడన్నారు. అప్పటికే విద్యార్థుల అందరు పరీక్ష హాల్‌లో ఉన్నారని తెలిపారు. గ్రూప్‌లో ఉన్న వారు ఆ మెసేజ్ ను 11 గంటలకు చూశారని తెలిపారు. ఎగ్జామ్ హాల్‌లో నుంచి పేపర్‌ను పంపినందుకు ఇన్విజిలేటర్‌పై కేసు నమోదు చేస్తామన్నారు.
Read Also: Paper Leak: వికారాబాద్ లో పదో తరగతి పరీక్ష పత్రం లీక్!
ఏపీలోనూ ఇలాంటి లీకువీరుల కథ బయటకు వచ్చింది. కడపలో పేపర్ లీక్ వ్యవహారం ఒకటి వెలుగులోకి రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో పదోతరగతి తెలుగు ప్రశ్నపత్రంలోని ప్రశ్నలకు మైక్రో జిరాక్స్ సమాధాన పత్రం ప్రత్యక్షం కావడం కలకలం రేపుతోంది. పరీక్ష ప్రారంభమైన రెండు గంటల తరవాత మాస్ కాపీయింగ్ కోసం సమాధానాలతో కూడిన మైక్రో జిరాక్స్ చేస్తుండగా ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఎక్కడో ఈ పశ్రపత్రం లీక్ అయినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రశ్నపత్రంలోని నంబర్ల వారీగా సమాధానాలను ఒకే పేపర్ లో అమర్చిన ఈ జిరాక్స్ సమాధాన పత్రం ఎక్కడ నుంచి వచ్చిందీ అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అసలు ఎవరు ఈ సమాధాన పత్రం తయారు చేశారు. ఎక్కడి నుంచి వచ్చింది. అనేదానిపై విద్యాశాఖ అధికారులు కూడా విచారిస్తున్నారు. అయితే, జిల్లాలో ఎక్కడా ప్రశ్న పత్రం లీకేజీ కాలేదని, అన్ని విధాలుగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు కడప డీఈవో రాఘవరెడ్డి చెబుతున్నారు. అయితే సీఎం సొంత జిల్లా బ్రహ్మంగారి మఠంలో మాస్ కాపీయింగ్‌కు సమాధాన పత్రం వెలుగుచూడటం ఆసక్తికరంగా మారింది. ఈ లీకు వీరులు ఎవరనేది విచారణలో బయటపడుతుందని అధికారులు అంటున్నారు. పదవతరగతి పరీక్షలు జరుగుతున్న వేళ ఈ పరిణామం అటు విద్యార్ధులు, ఇటు తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.