సరోగసీ ద్వారా సంతానం పేరుతో మోసం చేసిన రాజమండ్రిలోని యూఎస్ ఉమెన్ కేర్, ఫెర్టిలిటీ సెంటర్‌పై చీటింగ్ కేసు నమోదు చేశారు. రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటీవల హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాలు ఏపీలోనూ జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాధితులైన ఒక జంట తూర్పుగోదావరి జిల్లా వైద్యశాఖ అధికారులకు వాట్సాప్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్‌లోనూ కంప్లైంట్ ఇవ్వడంతో యూఎస్ ఉమెన్ కేర్, ఫెర్టిలిటీ సెంటర్‌పై అధికారులు విచారణ ప్రారంభించారు.
వైజాగ్‌లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌కు రిఫర్ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అధికారులు నోటీసులు అందజేసేందుకు వెళ్లిన సమయంలో నిర్వాహకులు ఇక్కడ నుంచి వెళ్లిపోయారు. రాజమండ్రి ప్రకాష్ నగర్‌లోని యూఎస్ ఉమెన్ కేర్, ఫెర్టిలిటీ సెంటర్ బయట గోడకు నోటీసు అంటించారు. హైదరాబాద్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌కు అనుబంధంగా ఈ సెంటర్ నిర్వహిస్తూ.. సరోగసి ద్వారా సంతానం పొందేలా చేస్తామంటూ ఒక్కొక్కరి వద్ద లక్షల రూపాయల్లో వసూలు చెసినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచిన తూర్పుగోదావరి జిల్లా వైద్యశాఖ అధికారులు ఏడుగురు సభ్యుల బృందంతో విచారణ చేపడుతున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ చీటింగ్ కేసుపై దర్యాప్తు చేపట్టారు. సంతాన ఉత్పత్తి కేంద్రాల్లో కమర్షియల్ సరోగసిపై సమాచారం ఉంటే తమకు తెలపాలని పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కోరుతున్నారు.
