Srisailam Project: ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు జలాశయాలకు వరద నీరు వచ్చి చేరుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. గతవారం రోజులుగా కురుస్తోన్న వర్షాలకు కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణ్‌పూర్ జలాశయాలు నిండిపోయాయి. దీంతో నీటిని విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి జలాశయానికి వచ్చిన నీటి వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్ జలాశయానికి లక్షకు పైగా క్యూసెక్కుల వరద వస్తుండగా.. జూరాల వైపు 80 వేల క్యూసెక్కులకు పైగా ప్రవాహాన్ని విడుదల చేస్తున్నారు. జూరాలకు ఎగువ నుంచి వస్తున్న వరదను దృష్టిలో పెట్టుకుని ఆ నీటిని దిగువకు విడుదల చేస్తన్నారు. జూరాల నుంచి శ్రీశైలం దిశగా వరద సాగుతోంది. జూరాల సామర్థ్యం 9.6 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7 టీఎంసీలగా పైగా నీరు ఉంది. ఎగువ నుంచి ప్రవాహం పెరిగే అవకాశం ఉండటంతో జూరాల నుంచి కిందికి నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల జలాశయం నుంచి వరద నీరు శ్రీశైలానికి వచ్చి చేరుతోంది.
Read Also: Bhatti Vikramarka: అడవులు, జలపాతాల వద్ద పర్యాటక అభివృద్ధికి చర్యలు చేపట్టండి.. అధికారులకు ఆదేశం
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా పెరిగింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి జూరాల ప్రాజెక్టు నుంచి 82,398 క్యూసెక్కులు వరద నీరు వచ్చి చేరుతుండగా.. ఔట్‌ఫ్లో నిల్‌గా ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు నిలిపివేశారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 813 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 36.08 టీఎంసీలుగా ఉంది. రాబోయే రెండు రోజుల్లో శ్రీశైలం జలాశయంలో భారీ స్థాయిలో నీటి నిల్వ పెరిగే అవకాశం ఉంది.