Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..

Dharmana Krishnadasu

Dharmana Krishnadasu

Dharmana Krishnadasu: శ్రీకాకుళం జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాసు ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన జిల్లాలో నెలకొన్న వ్యవసాయ పరిస్థితులను వివరించారు. వర్షాలు సరిగ్గా లేకపోవడంతో పంటల సాగు ఆలస్యమైందని, ఇప్పటికే సాగు చేసిన పంటలకు కూడా అవసరమైన ఎరువులు సక్రమంగా అందడం లేదని తెలిపారు. ప్రస్తుతం ఎకరాకు అర బస్తా చొప్పున మాత్రమే ఎరువులు అందుతున్న పరిస్థితి ఉందని ధర్మాన కృష్ణదాసు పేర్కొన్నారు. గతంలో తమ ప్రభుత్వం ఉన్న సమయంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన ఎరువులను అందించేవాళ్లమని చెప్పారు. పంటల ఇన్సూరెన్స్‌ను కూడా ప్రభుత్వమే చెల్లించేదని, దీంతో రైతులు ధైర్యంగా, సౌకర్యంగా వ్యవసాయం చేసేవారని తెలిపారు.

ప్రస్తుతం రైతులకు గతంలో అందిన గౌరవం, రైతు కోసం ఎంత చేసినా తక్కువే అనే భావన కనిపించడం లేదని ధర్మాన కృష్ణదాసు విమర్శించారు. దీనికి భిన్నంగా ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ పరిస్థితిని రైతులు కూడా పూర్తిగా అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వర్షపాతం తక్కువగా ఉండటంతో పాటు ఎరువుల కొరత తీవ్రంగా ఉందని ధర్మాన కృష్ణదాసు తెలిపారు. చివరకు పక్క రాష్ట్రం ఒడిశా నుంచి ఎరువులు కొనుగోలు చేసి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఒక్కో 50 కేజీల ఎరువుల బస్తాపై సుమారు రూ.800 వరకు అదనంగా వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు.

పెద్ద నాయకులే ఎరువులను దాచిపెడుతున్నారనే ఆవేదనను రైతులు వ్యక్తం చేస్తున్నారని ధర్మాన కృష్ణదాసు పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతుల సమస్యలపై గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు అవసరమైన ఎరువులు, సాగునీరు అందించడంతో పాటు పంటల రక్షణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ప్రజలు మాజీ సీఎం వైఎస్ జగన్‌ను గుర్తు చేసుకుంటున్నారని ధర్మాన కృష్ణదాసు వ్యాఖ్యానించారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాసు.