Minister Sridhar Babu: వర్గల్‌లో‘వింటేజ్ కాఫీ’ ప్లాంట్.. వేయి మందికి కొత్తగా ఉపాధి..

Sridhar Babu

Sridhar Babu

తెలంగాణ పారిశ్రామిక రంగంలో మరో కీలక ముందడుగు పడింది. సిద్దిపేట జిల్లా వర్గల్‌లో రూ.1,500 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ‘వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ లిమిటెడ్’ (VCBL) నూతన తయారీ ప్లాంట్ తొలి దశ పనులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు భూమి పూజ చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఏర్పాటుతో రాష్ట్రంలో ఆహార శుద్ధి (ఫుడ్ ప్రాసెసింగ్) రంగానికి మరింత ఊతం లభించనుంది.

ఈ నూతన ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు వెయ్యి మందికి పైగా స్థానిక యువతకు నూతన ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ఈ యూనిట్‌లో ప్రధానంగా ప్రీమియం ‘ఫ్రీజ్-డ్రైడ్ ఇన్‌స్టంట్ కాఫీ’ని ఉత్పత్తి చేయనున్నారు. 2027 నాటికి ఈ ప్లాంట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చి, ఏటా 11 వేల మెట్రిక్ టన్నుల కాఫీ ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకుంటుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

ఇక్కడ తయారయ్యే నాణ్యమైన కాఫీ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయనున్నారు. దీనివల్ల ‘మేడ్ ఇన్ తెలంగాణ’ బ్రాండ్ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా విస్తరించనుంది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ సమీపంలోని వర్గల్ వంటి ప్రాంతాల్లో ఇలాంటి భారీ పరిశ్రమలు రావడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు, స్థానికులకు మెరుగైన జీవనోపాధి దొరుకుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.