T20 World Cup: మహిళా ప్రపంచకప్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..

Sri Charani

Sri Charani

మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన 23వ మ్యాచ్‌లో భారత బౌలర్ శ్రీ చరణి ఒక సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకే టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో భారతదేశం తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఆమె సరికొత్త రికార్డు నెలకొల్పింది. మాంచెస్టర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీ చరణి రెండు వికెట్లు పడగొట్టడం ద్వారా పూనం యాదవ్ పేరిట ఉన్న 6 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టింది.

పూనం యాదవ్ 2020 ప్రపంచ కప్‌లో 10 వికెట్లు తీయగా, శ్రీ చరణి ఈ టోర్నీలో తన వికెట్ల సంఖ్యను 12కు పెంచుకుంది. మ్యాచ్ 20వ ఓవర్లో షోర్నా అక్తర్‌ను అవుట్ చేయడం ద్వారా పూనం రికార్డును సమం చేసిన చరణి, ఆ తర్వాత నహీదా అక్తర్‌ను అవుట్ చేసి 12వ వికెట్‌తో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ జాబితాలో డయానా డేవిడ్ (2010లో 9 వికెట్లు) మూడో స్థానంలో ఉంది. కాగా.. ఒకే ప్రపంచ కప్‌లో అత్యధికంగా 15 వికెట్లు తీసిన ప్రపంచ రికార్డు న్యూజిలాండ్‌కు చెందిన అమేలియా కెర్ పేరిట ఉంది.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో జుయైరియా ఫిరదౌస్ 33 పరుగులు, కెప్టెన్ నిగార్ సుల్తానా 32 పరుగులు చేశారు. ప్రారంభంలో భారత ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లు వదిలేసి పేలవ ప్రదర్శన చేసినప్పటికీ, ఆ తర్వాత బౌలర్లు పుంజుకున్నారు. ముఖ్యంగా నందిని వరుసగా రెండు క్యాచ్‌లు వదిలేసినా, ఆ తర్వాత జుయైరియా వికెట్ తీసింది. భారత బౌలర్లలో రాధా యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టగా, శ్రీ చరణి 2 వికెట్లు సాధించింది. బౌలర్ల సమిష్టి కృషితో బంగ్లాదేశ్‌ను 150 పరుగుల లోపే కట్టడి చేయగలిగారు.