రాజకీయ రంగ ప్రవేశం అంతా ఆశామాషీ విషయం కాదనేది అందరికీ తెలుసు. తలలు పండిన మేధావులే ఒక్కోసారి రాజకీయంలో తడబడటం సహజం. కానీ.. ఓ సాధారణ మహిళ.. ఆడపిల్లకు చదువెందుకు? ఇంటిపని చేసుకుంటే చాలనే భావజాలం బలంగా ఉన్న రోజుల్లోనే సమాజాన్ని ఆశ్చర్యపరిచే విధంగా డిగ్రీ విద్యను అభ్యసించింది. మారుమూల జిల్లా… వెనుకపడిన ప్రాంతంగా ముద్ర పడిన ప్రాంతంలో ఉన్న ఆమెకు డిగ్రీ పూర్తి అయ్యాక వివాహమైంది. అయినప్పటికీ.. విద్యావకాశాలు అతి తక్కువగా ఉన్నా.. ఆ మహిళ మాత్రం మెట్టినింట చేరి…పీహెచ్ డీలు సాధించింది. పార్లమెంటులో అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడింది… అంతేకాకుండా.. పిల్లలిద్దరినీ డాక్టర్లను చేసింది.. ఇన్ని ప్రతికూల పరిస్థితులను ఎదిరించి విజయం సాధించి నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచింది. అయితే ఆమె మరెవరో కాదు… రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతను కలిగి, విద్యా సంస్కరణలు అమలు చేయడంలో కీలక పాత్ర పోషించిన మంత్రి బొత్సా సత్యనారాయణ సతీమణి శ్రీమతి బొత్సా ఝాన్నీ… మరి ఒకసారి ఆమె విజయ ప్రస్థానంలోకి వెళదామా ?
నిజానికి ఝాన్సీ లక్ష్మీ పేరులోనే ఒక ఫైర్ ఉంది. ఒక వైబ్రేషన్ ఉంది. ఒక పవర్ ఉంది. ఒక కరేజ్ ఉంది. అవే నేడు ఆమెను ఒక స్థాయిలో నిలబెట్టాయని అందరూ అంటుంటారు. నేడు వైఎస్సార్ పార్టీ నుంచి విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఎంపీ అయి, ఆమె ఏం సాధించారో ఒకసారి చూద్దాం…
బొబ్బిలి, విజయనగరం స్థానాల నుంచి లోక్ సభకు రెండుసార్లు ఆమె ప్రాతినిథ్యం వహించారు. అంతకు ముందు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు. ఆ సమయంలో రాజకీయ ప్రత్యర్థులు గొడవ చేశారు. అప్పటికే పీహెచ్ డీ చేసి ఇంకా చదువుకుంటున్న ఆమెకు అడ్డు తగిలారు. దీంతో ఆమె కాలేజీకి సెలవు పెట్టి ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చారు.
విషయం తెలిసిన ఆ మహానుభావుడు ఒక జీవో తెచ్చారు. ఉద్యోగులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా చదువుకోవాలనే ఆసక్తి ఉంటే, రీసెర్చ్ స్కాలర్ గా చదివేందుకు అవకాశమిచ్చారు. దీంతో బొత్సా ఝాన్సీ లక్ష్మీ చదువుకోవాలనే కోరికను దిగ్విజయంగా నెరవేర్చుకున్నారు. ఇలా ఒకటి కాదు… ఎంఏ ఫిలాసఫీ, మాస్టర్ అఫ్ లా, పీ హెచ్ డీ ఇన్ ఫిలాసఫీ, పీ హెచ్ డీ ఇన్ లా ఇలా చదువుతూనే ఉన్నారు.
నిజానికి ఇరవై ఒక్క ఏళ్లకే ఆమెకు వివాహమైంది. అప్పుడు కేవలం డిగ్రీ మాత్రమే చదివారు. డాక్టర్ మజ్జి రామారావు, కళావతి దంపతులకు 1964లో ఆమె జన్మించారు. తండ్రి పోలీసు డిపార్ట్ మెంట్ లో ఉన్నత పదవిలో ఉండి రిటైర్ అయ్యారు. ఈ క్రమంలో వ్రత్తిరీత్యా బదిలీల కారణంగా పలు ప్రాంతాల్లో ఆమె విద్యాభ్యాసం కొనసాగింది.
మెట్టినింట అడుగుపెట్టిన తర్వాత ఆమె చదువుకు ఎంతో ప్రోత్సాహం లభించింది. ఆ ఉత్సాహంతోనే అటు చదువు, ఇటు రాజకీయాలు, మరోవైపు కుటుంబ పాలన వీటన్నింటినీ సమర్థవంతంగా నిర్వహించగలిగారు.
అందరిలా తనేదో ఉత్సవ విగ్రహంలా వెళ్లి లోక్ సభలో కూర్చుని వచ్చేయలేదు. అటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి కూడా సమస్యలు ఉంటే ధైర్యంగా ప్రశ్నించారు. అడిగాం కదాని అక్కడితో వదిలేయలేదు. వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేశారు. పట్టుపట్టి ఢిల్లీలోని సంబంధిత మంత్రిత్వ శాఖకు వెళ్లడం, మంత్రులను కలవడం, ఆ డిపార్ట్ మెంట్లకి వెళ్లడం ఫాలో అప్ చేయడం ఇలా చేసి ఇలా ఎన్నో సమస్యలని పరిష్కరించారు. వాటిలో ముఖ్యమైనవి..
2012లో… విశాఖలో వేలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆరోగ్య సేవల కోసం హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేది. CGHS వెల్ నెస్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని లోక్ సభలో ఝాన్సీలక్ష్మి డిమాండ్ చేశారు. ఆమె కోరికను మన్నించిన కేంద్ర ప్రభుత్వం 2017లో ఏర్పాటు చేసింది.
వట్టి మాటలు కట్టిపెట్టోయ్..గట్టి మేలు తలపెట్టవోయ్ అన్న ప్రముఖ కవి గురజాడ అప్పారావు పోస్టల్ స్టాంప్ ఏర్పాటుకు విశ్వ ప్రయత్నం చేశారు. పార్లమెంటులో గురజాడ విశిష్టతను వివరించారు. ఆయన గొప్పతనాన్ని పదేపదే వివరించారు. అలా గురజాడ 150వ జన్మదినోత్సవం నాడు పోస్టల్ స్టాంప్ ను విడుదల చేయించారు. ఆయన పేరును చిరస్థాయిగా ఉండేలా చేశారు.
బీహెచ్ పీవీ కేంద్ర ప్రభుత్వ సంస్థని బీహెచ్ ఈఎల్ లో మెర్జ్ చేయాలని ఆమె పార్లమెంట్ లో డిమాండ్ చేశారు. దేశంలోని తీర ప్రాంతాల్లో భద్రతపై ఆమె ప్రశ్నించారు. విశాఖపట్నం పోర్టుని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. 2012లో మహిళలకు విద్యా, ఉద్యోగాల్లో 33శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని గట్టి గా డిమాండ్ చేశారు. అందరిలో ఆలోచనలను రేకెత్తించారు.
మైనార్టీల సంక్షేమం కోసం పార్లమెంటులో పలు ప్రశ్నలు సంధించారు. ముఖ్యంగా హజ్ యాత్రకు వెళ్లేవాళ్లకి తత్కాల్ పాస్ పోర్టు మంజూరు చేయడం, అక్కడ నుంచి పవిత్ర జలాలను తీసుకురావడం లాంటివి ఝాన్సీ లక్ష్మీ కృషి వల్లే సాధ్యమయ్యాయి.
ఆసియా లోనే అతివేగంగా పురోగమిస్తున్న నగరాలలో విశాఖ రెండో స్థానంలో ఉంది. వరల్డ్ క్లాస్ రైల్వేస్టేషన్ ల జాబితాలో చేర్చి అభివృద్ధి చేయాలని కోరారు. అంతేకాదు విశాఖ జోన్ కావాలని డిమాండ్ చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంతంగా గనులను కేటాయించాలని 2009 లోనే లోక్ సభలో ఝాన్సీ లక్ష్మీ గట్టిగా డిమాండ్ చేశారు. ప్రైవేటు సంస్థలకే మైన్స్ ఇస్తున్నప్పుడు ప్రభుత్వ సంస్థకు కేటాయిస్తే స్టీల్ ప్లాంట్ ని బతికించినవాళ్లం అవుతామని అప్పట్లోనే లోక్ సభ లో కేంద్రాన్ని కోరారు.
ఇలా ఒకటి కాదు…ఎన్నో సమస్యలపై లోక్ సభలో బొత్సా ఝాన్సీలక్ష్మీ తన గళం వినిపించారు. బొబ్బిలి, విజయనగరం పార్లమెంటు స్థానాలకు 14,15 లోకసభా కాలం లో రెండు సార్లు ఎంపీ గా గెలుపొందారు. పార్లమెంట్ స్థాయి సంఘ సభ్యురాలిగా విశేష సేవలు అందించారు. ఉత్తమ పార్లమెంటేరియన్ గా సంసద్ రత్న అవార్డు అందుకున్నారు బొత్సా ఝాన్సీలక్ష్మీ.
నేడు విశాఖపట్నంలో ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఆమెను గెలిపిస్తే, విశాఖ సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించి ప్రజల గొంతుకై నిలుస్తారని అందరూ ఆశిస్తున్నారు. ఆమెపై కోటి ఆశలు పెట్టుకున్నారు అక్కడి జనం.