Card Prime Software: టెక్నాలజీ యుగంలో ఎప్పటికప్పుడు కొత్త మార్పులు.. సరికొత్త సాఫ్ట్‌వేర్లు అందుబాటులోకి వస్తున్నాయి.. అన్ని పనులు ఆన్‌లైన్‌లోనే, అరచేతిలోనే.. నిమిషాల్లో అయిపోతున్నాయి. ఇకపై ఆస్తుల రిజిస్ట్రేషన్లు కూడా ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెక్నాలజీ వైపు నడిపిస్తోంది. కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్టుమెంట్ (కార్డ్)ను ఆధునీకరించి కార్డ్ 2.0కు రూపకల్పన చేసింది.. కార్డ్ ప్రైమ్ పేరుతో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.. దీని ద్వారా స్టాంపు పేపర్లు, సంతకాలతో పనిలేకుండా రిజిస్ట్రేషన్లు చేసుకునే వీలు ఉంటుందట.. డాక్యుమెంట్‌ను ఎవరికివారే ఆన్‌లైన్‌లో తయారు చేసుకుని, ఆన్‌లైన్‌లోనే చలానా (స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు) కట్టి, ఒక టైం స్లాట్‌ను (అపాయింట్‌మెంట్) బుక్ చేసుకుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, లేదా గ్రామ, వార్డు సచివాలయానికి వెళితే అక్కడ వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసే విధానం త్వరలో అందుబాటులోకి రాబోతోందట..
Read Also: Imran Khan: తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్‌కి విముక్తి.. శిక్షను సస్పెండ్ చేసిన హైకోర్ట్
కొత్త సాఫ్ట్‌వేర్‌పై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రామకృష్ణ.. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇకపై కార్డ్ ప్రైమ్ సాఫ్ట్‌వేర్ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలుపెట్టనున్నట్టు తెలిపారు.. ఈ నెల 31 నుంచి కార్డ్ ప్రైమ్ సాఫ్ట్‌వేర్‌పై రిజిస్ట్రేషన్లు మొదలుపెడతామని.. వచ్చే నెల 15వ తేదీ లోపు అన్ని చోట్ల అమల్లోకి తెస్తామని వెల్లడించారు. ఈ సాఫ్ట్ వేర్ ద్వారా వినియోగ దారుల సమయం వృథా అవ్వదని స్పష్టం చేశారు. నేరుగా రిజిస్ట్రేషన్‌కు డిజిటల్ సైన్ ద్వారా అప్లై చేస్తే నేరుగా డాక్యుమెంట్ మెయిల్‌కి పంపిస్తాం అని వెల్లడించారు రామకృష్ణ.. అయితే, ఈ నెల 31 నుంచి ఏపీలో ఉన్న అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నూతన సాఫ్ట్‌వేర్ అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంటే.. మరోవైపు.. ఈ సాఫ్ట్‌వేర్ వద్దంటూ ఆందోళనకు దిగుతున్నారు డాక్యుమెంట్ రైటర్స్.. కార్డ్ ప్రైమ్ సాఫ్ట్‌వేర్‌ను నిరసిస్తూ రేపు, ఎల్లుండి నిరసనకు డాక్యుమెంట్ రైటర్స్ నిర్ణయించారు. మరోవైపు.. డాక్యుమెంట్ రైటర్స్ పెన్ డౌన్ నా దృష్టికి రాలేదని.. ఈ విధానం వల్ల డాక్యుమెంట్ రైటర్స్ కి ఇబ్బంది ఏమీ లేదని పేర్కొన్నారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రామకృష్ణ.