Special Focus: చంద్రుడిపై మొదటిసారి ఆధారాలతో సహా నీటి జాడ కనుగొన్న మిషన్ చంద్రయాన్-1. ప్రపంచంలోనే అత్యంత చవకగా తొలిసారే అంగారకుడిపై కాలు పెట్టిన మిషన్ మంగళయాన్. చంద్రుడి దక్షిణ ధృవంపై తొలిసారి కాలు మోపిన మిషన్ చంద్రయాన్-3. ఇన్ని ఘనతలు ఒకే స్పేస్ ఏజెన్సీ సాధించడం ఆషామాషీ కాదు. కానీ ఇస్రో ఈ అద్భుతాలన్నీ ఒంటిచేత్తో చేసి చూపించింది. ఇస్రో బడ్జెట్ తో పోలిస్తే పది రెట్లు బడ్జెట్ ఉన్న నాసా.. 14 సార్లు ప్రయత్నించినా సాధ్యం కానిది.. చంద్రయాన్-1 కు తొలిసారే సాధ్యమైంది. నాసా మార్స్ మిషన్ కంటే 9 రెట్లు తక్కువ ఖర్చుతో ఇస్రో మంగళయాన్ విజయవంతమైంది. భారీ ఖర్చుతో తయారైన రష్యా లూనా-25 కుప్పకూలిన చోటే.. కేవలం వందల కోట్ల రూపాయల ఖర్చుతో చంద్రయాన్-3 గర్వంగా నిలబడింది. ఇవి ఆషామాషీ విజయాలు కాదు. ప్రపంచ అంతరిక్ష రంగం దశ దిశ మార్చేసే ఘనతలు. కానీ, వీటి విలువ నిజంగా మన ప్రభుత్వాలకు అర్థమౌతోందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే ఇస్రో విజయాలకు వీరతాళ్లు వేయకపోయినా పర్లేదు.. కనీసం నిధుల కొరత లేకుండా చేసే ప్రయత్నం కూడా చేయడం లేదు. కేవలం విజయం సాధించిన కొద్ది క్షణాలు.. చప్పట్లు కొడుతున్నాం.. అదే ఎక్కువ అన్నట్టుగా ఉంది నేతల తీరు.
ఇస్రో సాధించిన ప్రతి విజయం.. ప్రతి భారతీయుడికీ సొంతం. కానీ, ఇస్రో కష్టాలు మాత్రం ఇస్రోకు మాత్రమే ప్రత్యేకం. మిగతా సంస్థలకు నిధులు తక్కువైతే ఎలాగోలా సర్దుకోవచ్చు. కానీ స్పేస్ ఏజెన్సీలు పనిచేసే విధానంలో చాలా తేడా ఉంటుంది. ప్రపంచ దేశాలతో పోటీపడి.. ప్రయోగాలు చేసే ఇస్రోకు.. మిషన్ ప్లానింగ్ కంటే.. ఫైనాన్షియల్ ప్లానింగ్ పెద్ద తలనొప్పిగా మారుతోందంటే నమ్మాల్సిందే. ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహం కొరవడటంతో.. ఇస్రోకు మిడిల్ క్లాస్ మైండ్ సెట్ వచ్చేసింది. ఎంత తక్కువ బడ్జెట్ ఎస్టిమేట్ ఇచ్చినా.. ఆఖరి క్షణం వరకు వీలైనంత తగ్గించే పద్ధతి అలవాటైంది. ఇది ఇస్రో ఉద్దేశపూర్వకంగా చేయటం లేదు. ప్రభుత్వాల నిష్క్రియాపరత్వమే దీనికి ప్రధాన కారణం. మెదళ్లు మథించి కొత్త ప్రయోగాలకు రూపకల్పన చేసే సైంటిస్టులే.. ఖర్చు విషయం కూడా చూసుకోవాలంటే ఎంత ఒత్తిడి ఉంటుందో చెప్పడం అంత తేలిక కాదు. ఈ లెక్కన ప్రపంచంలో మరే స్పేస్ సైంటిస్టుకూ ఇస్రో శాస్త్రవేత్తలకు ఉండే టెన్షన్ లో సగం కూడా ఉండదనే వాదన కూడా ఉంది.
ఇస్రో చేస్తున్న ప్రయోగాలు.. సాధిస్తున్న ఘనతల ప్రాతిపదికన చూస్తే.. ఏటా బడ్జెట్ పెరగాలి. కానీ 2023-24 ఇస్రో బడ్జెట్లో 8 శాతం కోత పెట్టారు. ఈ ఏడాది బడ్జెట్ రూ.12,543 కోట్లు. అదే గత ఏడాది బడ్జెట్ రూ.13,700 కోట్లు. సెంట్రాల్ సెక్టార్ స్కీమ్స్ ఇచ్చే రూ.1094 కోట్లు నిధులు కోత విధించారు. ఇస్రో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్, ఉపగ్రహాలు, లాంచ్ వెహికిల్స్ అభివృద్ధి, నిర్వహణపై ప్రభావం పడే అవకాశం. సెమీ కండక్టర్ ల్యాబరేటరీకి అసలు నిధులే ఇవ్వలేదు. అదేమంటే దీన్ని అంతరిక్ష విజ్ఞాన శాఖ నుంచి తొలగించి సెమీ కండక్టర్ మిషన్ కింద పెట్టామన్నారు. కానీ సాధారణ సెమీ కండక్టర్ మిషన్ కు, అంతరిక్ష రంగంలో సెమీ కండక్టర్ ల్యాబ్ కు చాలా తేడా ఉంది. ఈ విషయాన్ని మన నేతలు అర్థం చేసుకోవడం లేదు. చంద్రయాన్-3తో పాటు ఆదిత్య ఎల్ వన్, క్లైమేట్ అట్మాస్ఫియరిక్ ప్రోగ్రామ్ కు 32 శాతం నిధుల కోత పడింది. ఈ నిధులలేమి సమస్యను ఎదుర్కుంటూనే ఇస్రో జాబిల్లిపై కొత్త చరిత్ర సృష్టించిందనేది చేదు నిజం.
ఇప్పటికే ఇస్రో కీలక మిషన్లు కరోనా కారణంగా రెండేళ్లు ఆలస్యమయ్యాయి. దీనికి తోడు వాణిజ్య లాంచింగ్ అగ్రిమెంట్స్ కారణంగా లాంచ్ వెహికిల్స్ కొరత కూడా ఇస్రోను వేధిస్తోంది. లాంచ్ వెహికిల్స్ తయారీ మన దగ్గర ఇంకా ఊపందుకోలేదు. ఇలాంటి సమయంలో నిధులు పెంచకపోగా.. తగ్గించడమంటే.. రెక్కలు విరగ్గొట్టి పక్షిని ఎగరమన్నట్టే ఉంటుంది. ఇస్రో అంతరిక్ష రంగంలో గ్లోబల్ లీడర్ గా ఎదిగింది. స్పేస్ ఎక్స్ ప్లొరేషన్, ఉపగ్రహ సాంకేతికత, లాంచ్ సామర్థ్యంలో తిరుగులేదు. ఏళ్లుగా అద్భుతాలు సాధించింది. కానీ ఇస్రోను చాలా సవాళ్లు వేధిస్తున్నాయి. ఇతర స్పేస్ ఏజెన్సీలతో పోలిస్తే.. ఇస్రోకు అతి తక్కువ నిధులు అందుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహంతో నడిచే సంస్థ కావడంతో.. తక్కువ ఖర్చుతో ప్రయోగాలు చేయక తప్పని స్థితి. అయినా సరే ఇస్రో ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతలు అందిపుచ్చుకుంటూ.. దేశీయ తయారీతో తక్కువ ఖర్చుతో మైల్ స్టోన్స్ సాధిస్తోంది. కానీ ఇలా ఎంతకాలం అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇస్రో ఈ కొద్దిపాటి బడ్జెట్ తో ఇప్పటికి సాధించిందే చాలా ఎక్కువ. కానీ భవిష్యత్తులో నాసా లాంటి సంస్థలతో పోటీపడి స్పేస్ మార్కెట్ లో షేర్ కొట్టాలంటే.. నిధులు బాగా పెంచాలి. కానీ ప్రభుత్వాలు మాత్రం ప్రయోగాలు విజయవంతమైతే చప్పట్లు కొడుతున్నాయి కానీ.. డబ్బులు మాత్రం రాల్చడం లేదు.
గతంలో ఇస్రో మొదలుపెట్టినప్పుడు కూడా తినడానికి తిండి లేని పేదలున్న దేశానికి.. అంతరిక్ష ప్రయోగాలు అవసరమా అనే ప్రశ్నలు వచ్చాయి. అప్పట్నుంచి ఇప్పటివరకు టెక్నాలజీ చాలా మారింది. ఇస్రో చాలా సాధించింది. కానీ మన ప్రభుత్వాల భావన మాత్రం అక్కడే ఆగిపోయిందా అనే అనుమానం వస్తోంది. సాంకేతిక అభివృద్ధి కూడా ఇస్రోకు సవాలుగానే ఉంది. తొలి రోజుల్లో ఇస్రో ఇతర దేశాల నుంచి సాంకేతికత బదిలీ చేసుకునేది. కాలక్రమంలో సాంకేతిక ప్రాధాన్యతను గుర్తించి దేశీయంగానే కొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. దీని సాయంతోనే తక్కువ ఖర్చుతో ప్రతిష్ఠాత్మక ప్రయోగాలు మేనేజ్ చేస్తోంది. అంతరిక్ష ప్రయోగాలకు లాంచ్ వెహికిల్ కీలకం. దీని కోసం కూడా ఇస్రో చాలా పాట్లు పడింది. ఎన్నో కష్టాలు పడి పీఎస్సెల్వీ, జీఎస్సెల్వీ రాకెట్లను డిజైన్ చేసింది. అత్యధిక పెలోడ్ కెపాసిటీ, ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకునే సామర్థ్యం, అతి తక్కువ ఇంధన వినియోగం, తక్కువ లాంచింగ్ ఖర్చుతో రాకెట్లను డిజైన్ చేయడానికి ఇస్రో ఏళ్ల తరబడి శ్రమించింది. ఇప్పటికీ ఈ విషయంలో సాధించాల్సింది చాలా ఉందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ప్రతిష్ఠాత్మక గగన్ యాన్ ప్రాజెక్ట్ సక్సెస్ కావాలంటే రాకెట్ కెపాసిటీ పెంచుకోవడం చాలా కీలకం. ఇప్పటికీ నాసా మూన్ మిషన్ రాకెట్ కెపసిటీతో పోలిస్తే.. ఇస్రో మూన్ మిషన్ రాకెట్ పది రెట్లు తక్కువ. అందుకే చంద్రుడ్ని చేరుకోవడానికి 40 రోజులు పైగా సమయం పట్టింది. కానీ భవిష్యత్తులో ఇలాంటి విషయాల్లో సామర్థ్యం పెంచుకోకపోతే.. స్పేస్ రేస్ లో మనం వెనకబడే అవకాశం ఉంది.