ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆవరణలో అరకు కాఫీ స్టాల్‌ను శాసన సభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సీఎం అరకు కాఫీని స్పీకర్, డిప్యూటీ సీఎంలకు స్వయంగా అందించారు. అనంతరం స్టాల్ వద్ద అరకు కాఫీ బాక్సులను సబ్యులకు అందజేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఇక నుంచి అరకు కాఫీ అందుబాటులోకి రానుంది.
అరకు కాఫీకి ప్రచారం కల్పించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ ప్రాంగణంలో స్టాల్స్ ఏర్పాటు చేసుకునేందుకు అనుమతివ్వాలని టీడీపీ ఎంపీలు గతంలో స్పీకర్ ఓం బిర్లాను కోరారు. ఎంపీల విజ్ఞప్తి మేరకు స్టాల్స్ ఏర్పాటుకు స్పీకర్ అనుమతిని ఇచ్చారు. లోక్‌సభ డిప్యూటీ కార్యదర్శి అజిత్ కుమార్ సాహూ ఇందుకు ఆదేశాలు జారీ చేశారు. పార్లమెంట్‌లోని సంసద్ భవన్‌లో సంగం, నలంద లైబ్రరీ వద్ద స్టాల్స్ ఏర్పాటు అయ్యాయి. అరకు కాఫీ గురించి మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ సైతం గతంలో ప్రస్తావించిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కాఫీ ఉత్పత్తుల్లో అరకు కాఫీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.